May 13,2023 00:50

జనసంచారం లేని గుంటూరు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాలో మళ్లీ వేసవి తీవ్రత పెరిగింది. ఏప్రిల్‌ 29 నుంచి మే 10వ తేదీ వరకు వర్షాలతో చల్లబడిన వాతావరణం మారిపోయి మళ్లీ వేడిగాలులు పెరుగుతున్నాయి. ఈనెల మొదటి వారంలో వేసవి ప్రభావం కన్పించకుండా చలికాలంలో ఉండే వాతావరణంతో ప్రజలు సేదతీరారు. క్రమంగా వర్షాల ప్రభావం తగ్గడం, తుపాను ప్రభావం తొలగిపోవడంతో వేడిగాలులు మళ్లీ తీవ్రమయ్యాయి. శుక్రవారం పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీచాయి. ఉక్కపోత పెరిగింది. వేసవి తీవ్రతతో మళ్లీ విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగింది.
ఉష్ణోగ్రతలు పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. అదనపులోడ్‌ రిలీఫ్‌ పేరుతో రాత్రివేళ గ్రామాల్లో కొద్దిసేపు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. శనివారం వేడిగాలులు మరింత పెరగనున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని, మిగతా 12 మండలాల్లో వేడిగాలులు ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది. పల్నాడు జిల్లాలో 24 మండలాల్లో శనివారం వడగాల్పులు ఉధృతంగా ఉంటాయని, మరో నాలుగు మండలాల్లో సాధారణంగా ఉంటాయని వాతావరణ శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. శుక్రవారం పొన్నూరులో అత్యధికంగా 42.7, మాచర్లలో 42.6, తాడికొండ 41.0, గుంటూరు 39.7 ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మాచర్ల, గురజాల నియోజకవర్గాలల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
శని,ఆదివారాల్లోనూ ఇదే రీతిలో పల్నాడు ప్రాంతంలో 40 డిగ్రీల పైన గరిష్టంగా 43డిగ్రీల వరకు నమోదు కావచ్చునని వాతావరణ శాఖ అంచనావేసింది. వడగాల్పులు మరికొన్ని రోజులు కొనసాగుతాయని పల్నాడులో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చునని అంచనా వేశారు. ప్రస్తుతం వర్షం పడితేనే ప్రస్తుతం వేడిగాలులు తగ్గుతున్నాయి. వర్షం పడకపోతే రాత్రి 10 గంటల వరకు వేడిగాలుల ప్రభావం కన్పిస్తుంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని,తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. వేసవి తీవ్రతతో గుంటూరు, పల్నాడు జిల్లాలో ఉపాధి హామీ కార్మికులు అల్లాడిపోతున్నారు. ఉక్కపోతతో పనుల్లో ఉన్న కార్మికులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఎండ తీవ్రతతో చిరు వ్యాపారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రోడ్డుపక్కన వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులు కూడా ఎండ తీవ్రతకు అల్లాడుతున్నారు. ఈనెల 10వ తేదీ వరకు ఎండలు తక్కువగా ఉండటం వల్ల శీతలపానియాల వ్యాపారం చాలా తక్కువగా జరగ్గా గతరెండు రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో మళ్లీ ఈ వ్యాపారం పుంజుకుంది.