Jul 30,2021 11:56

తాడిపత్రి (అనంతపురం) : తాడిపత్రిలో రాజకీయ యుద్ధం మళ్లీ మొదలయ్యింది. స్థానిక ఎంఎల్‌ఎ పెద్దారెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ, ప్రస్తుత మున్సిపల్‌ చైర్మన్‌ జెసి ప్రభాకర్‌రెడ్డికి మధ్య సినీ తరహాలో మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు-ప్రతి సవాళ్ల సెగలు రగులుతున్నాయి. ఈరోజు తాడిపత్రి రెండో వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో... తాడిపత్రి ఖాకివనంలా మారింది. ఉద్రిక్తతల మధ్య భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇంతకీ తాడిపత్రి ప్రభాకర్‌ రెడ్డి చైర్మన్‌ కుర్చీకి ఎసరొచ్చిందా ?
ఎంఎల్‌ఎ పెద్దారెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జెసి ప్రభాకర్‌ రెడ్డికి మధ్య అక్రమ నిర్మాణాలు, కూల్చివేతల విషయంలో తేడాలొచ్చాయి. నువ్వా.. నేనా ? అనే తరహాలో సినీ పంచ్‌లు వేసుకుంటున్నారు. ఆ డైలాగులు వింటే.. చైర్మన్‌ గిరికి ఎసరు రాబోతోందా ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

జెసి ప్రభాకర్‌ : నువ్వు నన్ను దింపుతావా ? నన్ను దింపలేవు..
పెద్దారెడ్డి : నా వెంట ఎవ్వరూ లేరని అనుకుంటున్నారు.. నా వెంట లేనివారంతా జెసి అనుచరులే..

లేటెస్ట్‌ సవాళ్లు తాడిపత్రిని హీటెక్కిస్తున్నాయి. దయాదాక్షిణ్యాలు, ఫేస్‌టర్నింగ్‌ అనే పదాలు ఓ రేంజ్‌లో నలిగిపోయాయి.

పెద్దారెడ్డి : నా దయాదాక్షిణ్యాల వల్లే తాడిపత్రిలో తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఉన్నారు.
జెసి ప్రభాకర్‌ : నీకేమన్నా ఫేస్‌ వాల్యూ ఉందనుకుంటున్నావా ? సినిమాలో చిరంజీవి చెప్పినట్లు.. 'ఓసారి ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకో చెప్తాను.. ఆ.. పుర్రెముక దెబ్బతింది.. లేకపోతే ఎందుకలా మాట్లాడతావ్‌..' అన్నట్లు నీ ఫేస్‌ టర్నింగ్‌ చేసుకో.. ఏముంది నీకు ఫేస్‌ వాల్యూ.. జగన్‌ ఉన్నాడని గెలిచావ్‌.. పోలీసులు లేకపోతే నువ్వు లేవ్‌.. పోలీసోళ్ల దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నావ్‌..'

కిక్కెక్కే సీమ సినీ డైలాగులతో సవాళ్లు మండుతున్నారు. చూడు ఒకవైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు.. అంటూ... రెండు వైపులా మాటల యుద్ధం పీక్స్‌కు వెళ్లింది.

పెద్దిరెడ్డి : కొట్లాడుకోవాలనుకుంటే నువ్వు నీ ఫ్యామిలీ రండి.. నేను నా ఫ్యామిలీతో వస్తా.. కొట్లాడుకుందాం..
జెసి ప్రభాకర్‌ : చూసుకుంటాడంట బలాబలాలు.. పోలీసోళ్లు లేకపోతే బయటకు కూడా రాలేవు.
నేను రెండున్నర సంవత్సరాలు బయట తిరిగా.. మా ఇంటికొచ్చి ఏం పీకావ్‌..

పెద్దిరెడ్డి : కొత్తగా తయారయిన వైసిపి సైన్యం నాకుంది.. ఆ సైన్యం ఉన్నంతవరకు జెసి సైన్యం నా వెంట్రుక కూడా పీకలేవు..
జెసి ప్రభాకర్‌ : నీకు సైన్యం ఉండాలా.. వైసిపి సైన్యం లేకపోతే ఎక్కడికీ పోలేవు.. నీకు సొంత సైన్యం ఉండాలి.

పెద్దారెడ్డి, జెసి ప్రభాకర్‌ల మాటల యుద్ధంతో తాడిపత్రిలో అంతా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితి ఇప్పుడే మొదలయ్యిందా.. ఎప్పటినుండో మొదలయ్యి.. ఇప్పుడే తెరపైకి వచ్చిందా ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈరోజు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఒకప్పుడు జెసి బ్రదర్స్‌దే తాడిపత్రిలో హవా..
ఒకప్పుడు జెసి బ్రదర్స్‌దే తాడిపత్రిలో హవా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఆధిపత్యానికి గండిపడింది. తాడిపత్రిలో పెద్దారెడ్డి గెలుపొందారు. గతంలో పెద్దారెడ్డి జెసి ఇంటికి వెళ్లడం.. ఆగ్రహించిన జెసి అనుచరులు పెద్దారెడ్డి కూర్చున్న కుర్చీకి నిప్పు పెట్టడం దుమారం రేపాయి. తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ పగ్గాలను జెసి ప్రభాకర్‌ చేపట్టారు. ఇటీవల అక్రమ నిర్మాణాల వివాదం జెసి వర్సెస్‌ పెద్దారెడ్డి గా మారింది. కక్షపూరితంగా కూల్చివేస్తున్నారంటూ.. జెసి భగ్గుమంటే, సర్కార్‌ భవనాలను కబ్జా చేయడమేంటి ? అని పెద్దారెడ్డి రియాక్ట్‌ అయ్యారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. తాడిపత్రిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత లెక్క చెప్పేశారు.