- పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థి కార్తికేయకు ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకు
- ఇంజినీరింగ్ టాప్ టెన్‌లో ఆరు, అగ్రికల్చర్ అండ్ మెడికల్ (ఎఎం)లో నాలుగు ర్యాంకులు
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మన రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్ విభాగం మొదటి పది ర్యాంకుల్లో ఆరు, అగ్రికల్చర్ మొదటి పది ర్యాంకుల్లో నాలుగింటిని కైవసం చేసుకున్నారు. ఈ ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి బుధవారం జెఎన్‌టియులో విడుదల చేశారు. మొదటి విడత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆప్షన్ల నమోదుకు సెప్టెంబర్ 13 వరకు గడువు ఉంది. 15న సీట్ల కేటాయింపు ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
ఇంజినీరింగ్‌లో మన రాష్ట్రానికి ఫస్ట, సెకెండ్ ర్యాంకులు
ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సత్తి కార్తికేయ, రెండో ర్యాంకు కడప జిల్లా రాజంపేటకు చెందిన పణీశ్, మూడో ర్యాంకు తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ తెచ్చుకున్నారు. తెలంగాణలోని నల్గండ విద్యార్థి రామస్వామి నాలుగో ర్యాంకు, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వెంకట ఆదిత్య ఐదో ర్యాంకు, మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన పోతంశెట్టి చేతన్ మనోజ్ఞ ఆరో ర్యాంకు, విజయనగరానికి చెందిన మిడతన ప్రణరు ఏడో ర్యాంకు, నెల్లూరుకు చెందిన దేశారు సాయిప్రణరు ఎనిమిదో ర్యాంకు, విజయనగరానికి చెందిన సవరం దివాకర్ సాయి తొమ్మిదో ర్యాంకు, తెలంగాణలోని నల్గండ విద్యార్థి సొమిడి సాత్విక్ రెడ్డి పదో ర్యాంకు సాధించారు.
అగ్రికల్చర్ అండ్ మెడికల్ (ఎఎం)లో మొదటి మూడు ర్యాంకులూ తెలంగాణ వారివే...
అగ్రికల్చర్ అండ్ మెడికల్ (ఎఎం) విభాగంలో మొదటి మూడు ర్యాంకులూ తెలంగాణ విద్యార్థులకే దక్కాయి. హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన మండవ కార్తికేయ మొదటి ర్యాంకు, రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటకు చెందిన ఈమని శ్రీనిజ రెండో ర్యాంకు, కూకట్‌పల్లికి చెందిన తేరుపల్లి సాయి కౌశల్‌రెడ్డి మూడో ర్యాంకు తెచ్చుకున్నారు. నాలుగో ర్యాంకు మన రాష్ట్రంలోని అనంతపురానికి చెందిన రంగు శ్రీనివాస కార్తికేయ, ఐదో ర్యాంకు రాజమహేంద్రవరానికి చెందిన చందం విష్ణు వివేక్, ఆరో ర్యాంకు కాకినాడ విద్యార్థి కోల పవన్ రాజు, ఏడో ర్యాంకు తెలంగాణలోని ఖమ్మం విద్యార్థిని కన్నెకంటి లాస్యచౌదరి, ఎనిమిదో ర్యాంకు మన రాష్ట్రంలోని విజయవాడక చెందిన పల్లి వెంకటకౌషిక్ రెడ్డి, తొమ్మిదో ర్యాంకు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన రావి అభిరామ్, పదో ర్యాంకు నల్గండ విద్యార్ధి బండగొర్ల రామకృష్ణ సాధించారు.