Oct 02,2023 12:22

ప్రజాశక్తి - ఆలమూరు : చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాజమహేంద్రవరంలో చేపట్టిన నిరసన  దీక్షకు సంఘీభావం తెలుపుతూ సోమవారం మండలంలోని పెదపళ్ళలో మహిళలు కదం తొక్కారు. నారా భువనేశ్వరి దీక్షకు మద్దతు తెలపడానికై మహిళలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ముందుగా గ్రామంలోని శ్రీపార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో చంద్రబాబుపై వైకాపా ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు తొలగిపోయి, బయటకు రావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జాతిపితకు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రంలో అమలవుతున్న సైకో రాజ్యాంగం పోవాలని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ప్రసాదించిన ప్రజాస్వామ్య రాజ్యాంగం అమలు కావాలని, సైకిల్ అధికారంలోకి రావాలని నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా రాజమహేంద్రవరం నారా భువనేశ్వరి దీక్ష శిబిరానికి తరలి వెళ్లారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో  మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.