
ప్రజాశక్తి-పాలకొల్లు : బాబాయ్ ను గొడ్డలి పోటుకు గురి వేసిన వాడు, తల్లిని, చెల్లిని ప్రక్క రాష్ట్రానికి తరిమేసిన వాడు చంద్రబాబుకు హాని తలపెట్టడు అని నమ్మకం ఏమిటని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. పాలకొల్లులో 32 వ రోజు నిరాహార దీక్షా శిబిరం వద్ద ఆయన మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తో మీడియాతో మాట్లాడారు. 2039 మంది ఖైదీలలో చంద్రబాబు ఒకరని సజ్జల వ్యాఖ్యానించడం అంటే 5 కోట్ల ఆంధ్రుల ఆస్తి అయిన చంద్రబాబు పట్ల జగన్ ప్రభుత్వం ఎంత చులకనగా ఉందో అర్థమవుతుంది అన్నారు. వైద్యులు చంద్రబాబు ఆరోగ్య బులిటెన్ విడుదల చేయకముందే సజ్జల చంద్రబాబు బరువు గురించి ఎట్లా మాట్లాడుతారని ప్రశ్నించారు. చొక్కా చేతి చివరి వరకు ఉంచుకుంటే వేడి రాకపోతే ఏమొస్తుంది అంటూ సజ్జల చంద్రబాబు ఆరోగ్యాన్ని ఎగతాళి చేయడం బాధాకరం అన్నారు. గతంలో జయలలిత, మైకేల్ జాక్సన్ వంటి వారికి స్టెరాయిడ్స్, స్లో పాయిజన్ వంటి వివాదాస్పద వైద్యం అంటూ అనుమానాస్పద మృతిగా నమోదు కావడం మనం చూశామని ఆందోళన వ్యక్తం చేశారు.