- చొప్పెల్లలో టీడీపీ అర్ధనగ్న నిరసన.
ప్రజాశక్తి - ఆలమూరు : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా చొప్పెల్లలో మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు గురువారం అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. బ్రిటిష్ కాలంలో రాయలసీమలో అమలైన పాలెగాళ్ళ రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు రాష్ట్రమంతా అమలు చేస్తున్నారని వారు అన్నారు. గాంధీజీ తీసుకొచ్చిన స్వాతంత్రాన్ని, అంబేద్కర్ ఈ దేశానికి ప్రసాదించిన రాజ్యాంగాన్ని, వైకాపా ప్రభుత్వం, నాయకులు అవమానిస్తున్నారని, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పాలెగాళ్ల రాజ్యం పోయి ప్రజాస్వామ్య రాజ్యం రావాలని కోరుతూ మహాత్మా గాంధీజీ విగ్రహానికి తెదేపా మండల అధ్యక్షులు మెర్ల గోపాలస్వామి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సైకో పోవాలి సైకిల్ రావాలి, అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావాలి, న్యాయవ్యవస్థ చంద్రబాబుకు న్యాయం చేయాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










