Oct 28,2023 10:36

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్  : రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా నాగార్జున సాగర్ కుడి కాల్వకింద 11 లక్షల ఎకరాల్లో పంట భూములు బీడు భూములుగా మారాయని టిడిపి రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి కోమటినేని శ్రీనివాసరావు అన్నారు. సాగర్ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతూ సత్తెనపల్లి పట్టణలోని గుంటూరు రోడ్డులో వున్న ఎండిన అమరావతి మేజర్ కాల్వలో టిడిపి నాయకులు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యా నోటిపారుదల మంత్రి గారు కాస్త నీటిపారుదల గురించి ఆలోచించండి. రాష్ట్రంలో కరువు రాజ్యం మేలుతుంటే, రైతులు నీటి కొరకు ఎదురు చూస్తుంటే మీరు దుబాయ్ వెళ్లి తాగటానికి ఏ మందు బాగుంటదోనని అక్కడ  బ్రాందీ షాపుల తిరగటం  రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారనీ అన్నారు. సాగర్ కాల్వలు చుక్క నీరు లేక పిచ్చి మొక్కలతో నిండిపోయాయని అన్నారు.. పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. మీ అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రం బీడు వాడుతుంది. గతంలో చంద్రబాబు  ముందు చూపుతోహరిచంద్రపురం నుంచి నకిరేకల్ వరకు చేసిన ఎత్తిపోతల పథకం మీ అనాలోచితమైన చర్య తో ఆపడం వల్ల ఈ రోజున దాదాపుగా కుడికాలువ కింద 11 లక్షల ఎకరాలు బీడు వారుతున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు,  లోకేష్, పవన్ కళ్యాణ్ ను విమర్శించడం ఆపి రైతుల కష్టాలను చూసి సాగర కుడికాలువకు నీరు ఇచ్చే పనిలో ఉండాలని కోరారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ని ఎడారిగా మార్చిన ఘనత, అప్పుల ఊబిలో దించిన ఘనత వైసీపి ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఈకార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కంబాల వెంకటేశ్వర రావు,పట్టణ కమిటీ కార్యదర్శి  నూర్ బాషా జానీబాబు, ఉపాధ్యక్షులు శిఖా కొండలరావు తదితరులు పాల్గొన్నారు.