- అందరికీ తెలుసు ఏమి చెప్పారో ఏమి చేస్తున్నారో
- వైసిపి మళ్లీ గెలిస్తే గాలిని కూడా కొనుక్కోవాల్సిందే
- విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం) : తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుండి అభివృద్ధి బాటనే కోరుకుంటూ, ప్రజాభీష్టం మీదకే నడుచుకుంటోందని, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ఓపెన్ డిబేట్ కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిద్ధమా అని మాజీ తిరుపతి శాసన సభ్యురాలు మన్నూరు సుగుణమ్మ సవాల్ విసిరారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ టిడిపి హాయంలో ఒక్క తిరుపతికి బర్డ్ హాస్పిటల్, స్విమ్స్ హాస్పిటల్, మహిళా విశ్వవిద్యాలయం, తెలుగుగంగ నీరు, ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతి నగరాన్ని నందమూరి తారక రామారావు అభివృద్ధి చేశారని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయంలో తిరుపతిలో గరుడ వారధిని నిర్మించామని అయితే గరుడ వారధిని నిర్మించి నష్టపరిచామని మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడడం సభబు కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి అనే నినాదంతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే హేమలత మాట్లాడుతూ జగన్ గద్దె దిగడమే మంచిదని, నాడు ప్రజలకు ఏమి చెప్పారో నేడు ఏమి చేస్తున్నారో అందరికీ తెలుసునన్నారు. శ్రీకాళహస్తి టిడిపి ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పండుగ వేళ టిడిపి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వారిని జైల్లోకి నెట్టారని, వారి కుటుంబ సభ్యులు ఎంతో మనోవేదన చెందుతున్నారన్నారు. మా నాన్న మంత్రిగా పనిచేసిన రోజుల్లో కూడా వైసిపి పార్టీకి చెందినవారు వచ్చి వారి పనులను చేసుక వెళ్లేవారన్నారు. ఆనాడు నేడు వైసిపి పార్టీ అనుసరిస్తున్న అణిచివేత ధోరణులను మేము అమలు చేసి ఉంటే ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రను ఎలా చేసి ఉంటారని ప్రశ్నించారు. ఎన్నడూ లేని విధంగా శ్రీవారు కొలువై ఉన్న శేషాచలం అడవుల నుండి ఎర్రచందనం అక్రమ రవాణాను పెద్ద ఎత్తున చేస్తున్నారని విమర్శించారు. నేడు సామాన్యుడు ఇంటి నిర్మాణం చేసుకోలేని పరిస్థితులను తీసుకొచ్చారని, ఇక మిగిలిన ఏడాది కాలంలోనైనా సామాన్యుడికి తోడ్పాటు అందించేలా ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు. పోలీసుల గౌరవం తీసేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. వైసీపీ రాష్ట్రంలో మళ్లీ గెలిస్తే గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఏడు తన ఆస్తులపై శ్వేత పత్రాన్ని విడుదల చేస్తారని, మరి అధికారంలో ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్వేత పత్రాన్ని ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. టిడిపి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పొంగునూరులో టిడిపి గెలవబోతోందని, పులివెందులలో టిడిపి జెండాను ఎగురవేస్తామన్నారు. జిల్లాలో బినామీ పేర్లతో క్వారీలను నడుపుతూ కోట్లు వెనకేసుకుంటున్నారని, అమూల్ పాలను తీసుకువచ్చి జిల్లా పాడి రైతులను దెబ్బ కొట్టారన్నారు. టిడిపి కార్యకర్తలపై నమోదైన అక్రమ ఎఫ్ఐఆర్ లో ' అదర్స్ ' అని పెట్టి టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని జైల్లకు పంపిస్తున్నారని అన్నారు. అధికారంలోకి రాగానే టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో తిరుపతి పట్టణ టిడిపి అధ్యక్షులు వట్టికుంట శంకరనారాయణ, మునిశేఖర్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.










