బద్వేలు బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న త్యాగరాజ కాలనీలో సిమెంట్ రోడ్లు, డ్రెయినేజీ కాలువలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు అనేక దపాలుగా ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు, నిరసన రూపంలో తెలియజేసినప్పటికీ సమస్యలు పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని తెలియజేశారు. శనివారం డివైఎఫ్‌ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో త్యాగరాజ కాలనీలో పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో కలిసి అధ్వానంగా ఉన్న రోడ్డు దగ్గర నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కాలనీలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. ముఖ్యంగా రహదారి అధ్వానంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడు తున్నారని తెలిపారు. డ్రెయినేజీలోని మురుగునీరు రోడ్డుపై రావడంతో దుర్వాసనతోపాటు, విషపురుగుల సంచారం అధికమైందని పేర్కొన్నారు. పిల్లలు బయటికి రావాలంటే భయపడుతున్నారని, పలుమార్లు ప్రజాప్రతినిధులకు, మున్సిపాలిటీ అధికారులకు తెలియేసినా వారు సమస్యలు పరిష్కరించలేదని వాపోయారు. ఇప్పటికైన సమస్యలు పరిష్కరించి రోడ్డును, డ్రెయినేజీ కాలువలను ఏర్పాటు చేయాలని లేని పక్షంలో డివైఎఫ్‌ఐ యువజన సంఘంతో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి గంగనపల్లి నాగార్జున, ట్రెజరర్ పి.సురేంద్ర, ఉపాధ్యక్షులు యు.ఆంజనేయులు, గురవయ స్థానికులు పాల్గొన్నారు.










