Jul 31,2023 23:00

ఎమ్మెల్సీ దువ్వాడ వాహనాన్ని అడ్డుకున్న నిర్వాసితులు

- ఎమ్మెల్సీ దువ్వాడకు నిరసన సెగ
- మూలపేట నిర్వాసితులు ఆందోళన
ప్రజాశక్తి - నౌపడ: 
మా త్యాగాలను గుర్తించకుండా మమ్మల్ని అన్యాయం చేస్తారా అంటూ మూలపేట, విష్ణుచక్రం నిర్వాసితులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను నిలదీశారు. దీంతో సంతబొమ్మాళి మండలం మూలపేటలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు వద్ద సోమవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భూసేకరణ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జాప్యమవుతోందని, గ్రామస్తులకు పోర్టు వాహనాల ద్వారా ఇబ్బందులు కలుగుతున్నాయని నిర్వాసితులు ఆదివారం వాహనాలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డితో కలిసి సోమవారం నిర్వాసితులతో మాట్లాడేందుకు మూలపేటకు వచ్చారు. దీంతో ఒక్కసారిగా నిర్వాసితులు దువ్వాడ శ్రీనివాస్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవడం లేదని, కనీసం సర్పంచ్‌కు సమాచారం ఇవ్వకుండా గ్రామానికి రావడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. టెక్కలి సిఐ చంద్రమౌళి, నౌపడ, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి ఎస్‌ఐలు కిషోర్‌ వర్మ, మధుసూదనరావు, మహమ్మద్‌ అలీ కలుగజేసుకుని శాంతియుతంగా మాట్లాడాలని నిర్వాసితులను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో పోలీసులు, నిర్వాసితుల మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్సీ, సబ్‌ కలెక్టర్‌ ఘటనా స్థలానికి దూరంగా వెళ్లిపోయి ఐదుగురు ప్రజాప్రతినిధులు రావాలని కబురు పెట్టారు. దీంతో గ్రామస్తులందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చెప్పాలనుకున్నా బహిరంగంగా గ్రామస్తులతో మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. దీంతో మూలపేటలో మండపం వద్ద నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరిగా సమస్యలు తెలియజేయాలని సూచించారు. దీంతో మూలపేట సర్పంచ్‌ బాబూరావు మాట్లాడుతూ నిర్వాసితులకు ఇచ్చిన మాటలు మార్చడం అన్యాయమన్నారు. పోర్టు నిర్మాణ కాంట్రాక్టు పనుల విషయంలో తమను విస్మరించి ఏకపక్షంగా మీ అనుకూలురుకే పనులు కట్టబెట్టమేమిటని నిలదీశారు. జీడి చెట్లకు రూ.ఐదు వేలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ.2,150 ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. గ్రామస్తుడు రాంబాబు మాట్లాడుతూ ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో ఉప్పునీరు పడుతోందని, దాన్ని మార్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు. టెక్కలి నుంచి ఆర్‌ అండ్‌ కాలనీ వరకు పైపులైన్‌ ద్వారా నీటి సరఫరా చేసే ఆలోచన చేస్తున్నట్లు దువ్వాడ నిర్వాసితులకు తెలిపారు. ఆరు నెలలు, అంతకంటే తక్కువ కాలపరిమితో పిడిఎఫ్‌ కోల్పోయిన యువతకు కాలపరిమితిని శంకుస్థాపన చేసిన రోజు వరకు పరిగణించాలని నిర్వాసితులు అడిగారు. దీనిపై సిఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని దువ్వాడ బదులిచ్చారు. నిర్వాసిత గ్రామాల్లోని యువతకు వారి అర్హతకు తగిన ఉద్యోగం, పని వెంటనే కల్పించాలని నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. స్థానికేతరులు పనులకు వస్తున్నారని, స్థానిక యువతను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో నాయకుల మధ్య విభజించు, పాలించు విధానంలో వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. దీంతో అవసరమైతే మళ్లీ వచ్చి సమావేశమవుతామని చెప్పి దువ్వాడ వెనుదిరిగారు.