
ప్రజాశక్తి - పాలకోడేరు
ఎంతోమంది త్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్రం వచ్చిందని, భవిష్యత్తు తరాల వారికి స్వాతంత్ర ఫలాలు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విస్సాకోడేరు సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డాక్టర్ డిఆర్.స్వర్ణలత అన్నారు. సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆధ్వర్యంలో 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని 300 మీటర్ల జాతీయ జెండాను సోమవారం ప్రదర్శించారు. హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయలు ఉపాధాయ్యేతర సిబ్బంది భారీ జెండాను చేత పట్టుకుని గ్రామ పురవీధుల్లో ర్యాలీ చేశారు. దేశం గొప్పతనం గురించి వివరించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ పి.రీచీ జాన్ కిట్స్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.
భీమవరం రూరల్ : డాక్టర్ రమణరాజు అంధ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శ్రీవిజ్ఞానవేదిక, జిల్లా సర్వోదయ మండలి అధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అంధ బాలలు రమ్య, రాధిక, అనూష (ఇంటర్ విద్యార్థులు) గేయలతో అందరినీ అలరించారు. పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ రమణరాజు మాట్లాడుతూ వికలాంగులు, బధిరులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడంతో వారిలో దేశభక్తి చైతన్యం కలుగుతుందన్నారు. ఇక్కడ విద్యార్థులు ప్రపంచ విషయాలపై అవగాహనతో ఉంటున్నారని, ఈ స్కూల్ స్థాపన నుంచి రంగసాయి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఇదొక దేవాలయంగా భావిస్తున్నామని, అంధుల జీవితాల్లో వెలుగులు నింపుతూ వారికి సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఆర్‌డిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మనిస్ట్రేటివ్ ఆఫీసర్ పి.అమూల్యరావు, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నరసాపురం టౌన్ : నరసాపురంలో శ్రీ సూర్య జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 200 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, కళాశాల నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సూర్య కళాశాల కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ మాట్లాడుతూ ప్రధాని పిలుపు మేరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరావేయలన్నారు. ప్రతి ఒక్కరూ దేశం పట్ల దేశ భక్తి కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.