Mar 04,2023 00:13

తవ్వి రోడ్డుపై మట్టి వేసి వదిలేసిన దృశ్యం

ప్రజాశక్తి-యలమంచిలి రూరల్‌
రోజూ వందలాది మంది ప్రయాణం సాగించే యలమంచిలి- పెద్దపల్లి ప్రధాన రహదారిలో తాగునీటి పైపు లైన్ల నిర్మాణానికి తవ్వి, పనులు చేపట్టకుండా వదిలేయడంతో ఈ మార్గంలో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం నిధులతో ఇంటింటికి కుళాయిల ఏర్పాటుకు పైపులైన్‌ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కాంట్రాక్టరు యలమంచిలి- పెద్దపల్లి ప్రధాన రహదారిలో యలమంచిలి రైల్వే గేట్‌ నుండి రామ్‌నగర్‌ కాలనీ మీదుగా బైపాస్‌ వరకు కిలో మీటరన్నర మేరకు జెసిబితో కాలువ తవ్వి ఆ మట్టిని రహదారి మధ్యలో వేశారు. కాలువ తవ్వి వారం రోజులైన నేటికీ పైపులైన్ల నిర్మాణ పనులు చేపట్టలేదు.
ఈ మార్గంలో పెద్దపల్లి, మంత్రిపాలెం, పెదగొల్లల పాలెం, చినగొల్లల పాలెం, వెంకటా పురం, నవాబుపేట తదితర ఆరు గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రజలు నిత్యం ప్రయాణం సాగిస్తూ ఉంటారు. వారం రోజులుగా రహదారికి మధ్యలో వేసిన మట్టిని తీయకపోవడంతో ఈ మార్గంలో వాహనాలపై రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. దీంతో ఈ ఆరు గ్రామాల ప్రజలు నాలుగు కిలోమీటర్ల మేరకు అదనంగా ప్రయాణించడంతో పాటు రైల్వే గేట్‌ పడితే అరగంట పాటు అక్కడే నిరీక్షించాల్సి వస్తోంది. రాంనగర్‌ కాలనీ వాసులు కూడా రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి మార్గాల్లో పనులు చేసేటప్పుడు 100 నుండి 200 మీటర్ల మేరకు తవ్వి పైపులైన్లు వేసి, పూడ్చివేసిన తరువాత మళ్లీ తవ్వకాలు చేసి పైపులైన్లు వేయాల్సి ఉంది. గతంలో అనేక ప్రాంతాల్లో ఇలాగే చేశారు. కాని ఇక్కడ కాంట్రాక్టరు ఇష్టానుసారంగా కిలోమీటరన్నర తవ్వి రోడ్డు మధ్యలోనే మట్టిని వారం రోజులుగా వదిలేశారు.
మరో వైపు కాంట్రాక్టరు పైపులైన్ల కోసం సీసీ రోడ్లు, తారు రోడ్లు అనే తేడా లేకుండా జెసిబితో ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. దీంతో రోడ్ల పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. శుక్రవారం మున్సిపాలిటీ పరిధి ఎర్రవరంలో పైపులైన్‌ వేయడానికి సిసి రోడ్డు మధ్య నుండి కాలువ తవ్వారు. అలాగే ఇప్పటికే తాగునీరు అందిస్తున్న పైపులైన్‌ కూడా పగిలి నీరు వృథాగా పోతుందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై ఈ పనులు చేపట్టే వారిని ప్రశ్నించగా, పైపులైన్లు వేసేటప్పుడు రోడ్లు శిథిలం కావడం సహజమేనని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైపులైన్ల పనులు త్వరితగతిన పూర్తి చేయించి తమ రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని, ధ్వంసమైన రోడ్లను సదరు కాంట్రాక్టరు చేత మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.