Mar 16,2023 22:31

పాతగాజువాక జంక్షన్‌లో దుమ్ము ధూళితో ఉన్న రహదారి

ప్రజాశక్తి -గాజువాక : పాత గాజువాక జంక్షన్‌ దుమ్ము, దూళితో నిండిపోతోంది. ఈ జంక్షన్‌ విస్తరణ పేరుతో 20 రోజుల క్రితం డివైడర్లను తొలగించారు. తొలగింపు పనులు రెండు రోజుల్లో పూర్తిచేశారు. అభివృద్ధి పనులను ఇంజినీరింగ్‌ అధికారులు ప్రారంభించకపోవడంతో తవ్విన రోడ్లపై ఉన్న దుమ్ము, ధూళి ఎగిరి ప్రయాణికులపై పడుతోంది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం సమయంలో రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులకు సంబంధించిన వాహనాలతో దుమ్ము మరింత ఎక్కువగా వ్యాపిస్తోంది. ఎగిరిన దుమ్ము కారణంగా చుట్టుపక్కల రోడ్డుపైన టిఫిన్‌ చేసే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా సాయంత్రం వేసిన గాలికి మరింత దుమ్ము ఎగురుతోంది. ఒకప్పుడు ట్రాఫిక్‌కు భయపడిన ప్రజలు ఇప్పుడు దుమ్ము, దూళితో భయపడుతున్నారు. పనులు ప్రారంభించకుంటే తాత్కాలికంగా వాటర్‌ ట్యాంక్‌తోనైనా రోడ్డు తడిపితే ఉపశమనం ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.