త్వరలో వంద పడకల వైద్యశాల ప్రారంభం : ఎమ్మెల్యే
ప్రజాశక్తి - బనగానపల్లె
త్వరలో బనగానపల్లెలోని 100 పడకల ఏరియా వైద్యశాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కాటసాని రామి రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ప్రభుత్వ వైద్యశాలను, డబల్ రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రభుత్వ వైద్యశాల పనులను కాంట్రాక్టర్ మహేశ్వరరెడ్డి, వైద్యశాల సూపర్నెండెంట్ డాక్టర్ సుజాతలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ. 22 కోట్లతో 100 పడకల ఏరియా వైద్యశాల పనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలిపారు. రెండు నెలల్లో పనులు పూర్తవుతాయని చెప్పారు. త్వరలో అన్ని ఎక్విప్మెంట్స్ రానున్నట్లు తెలిపారు. వైద్యశాలలో 23 మంది డాక్టర్లకు గాను 15 మంది ఉన్నారని, 24 మంది స్టాఫ్ నర్స్‌కు 18 మంది ఉన్నారని, మరో 24 మంది స్టాప్ నర్సులు కావాలని, శానిటేషన్ సిబ్బంది ప్రస్తుతం 8 మంది ఉన్నారని, మరో 20 మంది కావాలని, సెక్యూరిటీ గార్డులు ఐదు మంది ఉన్నారని మరో 11 మంది కావాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపినట్లు తెలిపారు. నంద్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని, బనగానపల్లె ఏరియా వైద్యశాలను త్వరలో జిల్లా వైద్యశాలగా మార్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో వైసిపి అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, డాక్టర్ శిరీష, పంచాయతీరాజ్ డిఇ నాగ శ్రీనివాసులు, ఎంపీడీవో శివరామయ్య, వైసిపి జిల్లా ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుండం నాగేశ్వరరెడ్డి, నాయకులు డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, అత్తార్ జాహిద్ హుస్సేన్, బండి బ్రహ్మానంద రెడ్డి, జిల్లెల్ల శంకర్ రెడ్డి, ఎర్రగుడి రామసుబ్బారెడ్డి, గౌండ కంబగిరి తదితరులు పాల్గొన్నారు.










