Jul 26,2023 22:15

ప్రాజెక్టును పరిశీలిస్తున్న మంత్రి అప్పలరాజు

- రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి - మెళియాపుట్టి: 
ఉద్దానం శుద్ధజల తాగునీటి ప్రాజెక్టును త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో మూడు నియోజకవర్గాల ప్రజల తాగునీటి కల నెరవేరబోతోందని చెప్పారు. హిరమండలం, మెళియాపుట్టి వద్ద రూ.700 కోట్లతో నిర్మాణం చేపడుతున్న ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు పనులను జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్యే రెడ్డి శాంతితో కలిసి బుధవారం పరిశీలించి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిరమండలం నుంచి ఇచ్ఛాపురం వరకు సుమారు 148 కిలోమీటర్ల మేర పైపులైన్ల ద్వారా తాగునీటిని అందించనున్నట్లు చెప్పారు. రోజుకు 8.4 కోట్ల లీటర్ల వంశధార నీటిని మెళియాపుట్టి వద్ద శుద్ధజలంగా మార్చి ప్రతి ఇంటికీ అందిస్తామని తెలిపారు. ఉద్దాన ప్రాంత భూగర్భజలాలు కిడ్నీ వ్యాధులకు కారణమేమోనన్న కోణంలో వంశధార నదీ జలాలను ఎత్తిపోతల ద్వారా శుద్ధి చేసి, ఎక్కడికక్కడ నీటి నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటు ద్వారా మళ్లీ శుద్ధి చేసి ఇంటింటికీ అందించనున్నామని వివరించారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మహమ్మారిని శాశ్వతంగా పారదోలేందుకు ఇది దోహదపడుతుందన్నారు. ఇప్పటికే ట్రయల్‌ రన్‌ ద్వారా పలాస వరకు నీరు వస్తోందని, మరికొద్ది రోజుల్లో ఇచ్ఛాపురంలో ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పురుషోత్తపురం వరకు వస్తుందని తెలిపారు. ఇప్పటికే రూ.700 కోట్లు మంజూరు కాగా, అదనపు నిధులు కావాలని ఇంజినీరింగ్‌ అధికారులు పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌, వంశధారలు ఎస్‌ఇలు టి.ఎస్‌ ప్రసాద్‌, డోల తిరుమలరావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇఇ జాన్‌ బెనహర్‌, డిఇ మధుసూదనరావు, ఆశాలత, రజాక్‌, తహశీల్దార్లు పి.సరోజిని, బి.మురళీమోహన్‌, ఎంపిడిఒ పి.చంద్రకుమారి, పలువురు నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.