Aug 02,2021 09:24

న్యూఢిల్లీ : కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఈ నెలలో సోషల్‌ మీడియా సంస్థల ప్రతినిధులను కలవనున్నారని సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. నూతన సమాచార సాంకేతిక చట్టంలో చేసిన కొత్త మార్పుల కారణంగా కొన్ని నెలలుగా సోషల్‌ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్‌, కేంద్రానికి మధ్య ప్రతిష్టంభన నెలకొన్నాయి. దీని కారణంగా ట్విట్టర్‌ మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయింది. తమ నిబంధనలను అనుగుణంగా నడుచుకోవాలని అన్ని సంస్థల మధ్యవర్తులకు (ఎస్‌ఎస్‌ఎంఐలు) మూడు నెలల సమయం ఇచ్చినప్పటికీ...ఐటి రూల్స్‌ను బేఖాతరు చేస్తూందంటూ కేంద్రం ట్విట్టర్‌పై ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్‌ కూడా దాఖలు చేసింది. ఐటి చట్టాలను సవాలు చేస్తూ వివిధ కోర్టుల్లో దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ..కేంద్రం అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. జులై 28న విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు...ట్విట్టర్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌పౖౖె అసంతృప్తిని వ్యక్తం చేస్తూ... గ్రీవియన్స్‌ అధికారిగా నియమించిన వ్యక్తి వివరాలతో కూడిన సరికొత్త అఫిడవిట్‌ దాఖలు చేయాలని సంస్థకు మరో అవకాశాన్నిచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 6కు వాయిదా వేసింది.