
ప్రజాశక్తి - తాడికొండ : పారదర్శక పాలన అందించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తెచ్చిందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. లాం గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, వాటర్ ప్లాంట్‌ను ఆమె శనివారం ప్రారంభించి మాట్లాడారు. నిరుద్యోగ సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, త్వరలోనే పలు రకాల ఉద్యోగాలు భర్తీ చేయనుందని చెప్పారు. వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏనాడూ పేదల గురించి పట్టించుకోలేదన్నారు. వైసిపి హయాంలో పారదర్శక పాలన ప్రజలచెంతకు వచ్చిందని, రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు రానున్నాయని అన్నారు.
చంద్రబాబు అరెస్టు శుభ పరిణామం
అనంతరం క్రిస్టినా విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు శుభపరిణామమని, దేశంలో న్యాయం, ధర్మం ఇంకా బతికే ఉన్నదని అనడానికి ఇదొక ఉదాహరణని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.371 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితమంతా అవినీతి కంపని దుయ్యబట్టారు. 70 ఏళ్ల వయసులో తనకు బీపీ, షుగర్ ఉందని చంద్రబాబు అంటున్నారని, అలాంటి వ్యక్తి సిఎంగా ఎలా పనికి వస్తారని ప్రశ్నించారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే న్యాయస్థానాలకు వెళ్లారని విమర్శించారు. కార్యక్రమాల్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ సిహెచ్.పూర్ణచంద్రరావు, బి.వెంకటేశ్వరరెడ్డి, ఆర్.రంగారావు, ఆర్.దివ్య, బి.సాయిప్రసాద్, టి.శివన్నారాయణ, జి.వెంకట్, జి.సాంబిరెడ్డి పాల్గొన్నారు.