Nov 04,2023 22:26

ప్రజాశక్తి - భీమవరం
          ఈ నెలలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారని, ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లకు చర్యలు తీసుకుని సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏ మండలంలో ముఖ్యమంత్రి పర్యటించినా అధికారులు సిద్ధంగా ఉండేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. స్థానిక జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికలు, రీసర్వే, దీపావళి పండుగకు ముందస్తు జాగ్రత్తలు తదితర అంశాలపై కలెక్టర్‌ ప్రశాంతి సంబంధిత డివిజన్‌, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సమిష్టిగా పని చేయాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు, వార్డులను గుర్తించి ఒక నివేదికను తయారు చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. గత సార్వత్రిక ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో ఘర్షణలు, నమోదైన పోలీసు కేసులు, నగదు సీజ్‌ చేసిన కేసులు తదితర అంశాలపై రికార్డులను పూర్తిగా పరిశీలించి ఒక నివేదికను సిద్ధం చేసుకోవాలన్నారు. సంబంధిత ఆర్‌డిఒలు పోలింగ్‌ సామగ్రి నిల్వ ఉంచేందుకు స్టోరేజీ పాయింట్లు, డిస్ట్రిబ్యూషన్‌, శిక్షణ నిర్వహణకు వీలుగా ఉండే భవనాలను గుర్తించాలని స్పష్టం చేశారు.
1174 మందికి పట్టాల మంజూరుకు సిద్ధం చేయాలి
లంక భూములు, అసైన్డ్‌ భూములు, శ్మశాన భూములకు సంబంధించిన రికార్డులను పునఃపరిశీలించాలని కలెక్టర్‌ చెప్పారు. యలమంచిలి, ఆచంట, పెనుగొండ మండలాల్లో గోదావరి లంక భూములు సంబంధించి 818 ఎకరాలు 'సి' క్లాస్‌ నుండి 'బి' క్లాస్‌కు మార్చి 1,174 మందికి పట్టాలు మంజూరు చేయడానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ జరుగుతుందన్నారు.
30 నాటికి మూడో దశ రీసర్వే పూర్తి చేయాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ ప్రశాంతి తెలిపారు. రీసర్వే ప్రక్రియకు హాజరుకాని రైతులకు నోటీసులు పంపాలని, వారి సమక్షంలోనే రీసర్వే జరగాలని అన్నారు. రీసర్వే ఉపయోగాల గురించి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 30వ తేదీ నాటికి మూడో దశ రీసర్వే పూర్తి చేయాలన్నారు.
నిబంధనలు పాటించకపోతే దుకాణాలు సీజ్‌
దీపావళి మందుగుండు సామగ్రి తయారీ, నిల్వ కేంద్రాలు, దుకాణాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. నిబంధనలకు ఎవరైనా విరుద్ధంగా ప్రవర్తిస్తే సీజ్‌ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, నరసాపురం ఆర్‌డిఒ ఎం.అచ్యుతఅంబరీష్‌, డిప్యూటీ కలెక్టర్లు రాగడ మణి, బిఎస్‌ఎన్‌.రెడ్డి, డిప్యూటీ ట్రెయినీ కలెక్టర్‌ కానాల సంగీత్‌ మాధుర్‌, సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌ టి.శివరామప్రసాద్‌, డిఎస్‌ఒ ఎన్‌.సరోజ, జిల్లా వ్యవసాయాధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ డి.మహేశ్వరరావు, హౌసింగ్‌ పీడీ డాక్టర్‌ ఆర్‌సి.ఆనంద్‌కుమార్‌, డిఆర్‌డిఎ పీడీ ఎంఎస్‌ఎస్‌.వేణుగోపాల్‌, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, ఎఎస్‌ఒ ఎం.రవిశంకర్‌, డ్వామా పీడీ ఎస్‌టివి.రాజేశ్వరరావు, జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షులు డాక్టర్‌ రామభద్రరాజు పాల్గొన్నారు.