Jul 22,2021 20:31

ముంబయి : అతి త్వరలోనే ఎటిఎం లావాదేవీలపై ఛార్జీలు పెరగనున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఇటీవల చేసిన సవరణలతో ఆగస్టు ఒక్కటో తేది నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. పెరిగిన నిర్వహణ వ్యయం వల్ల ఈ చార్జీల పెంపునకు బ్యాంక్‌లకు ఆర్‌బిఐ అనుమతించింది. ఆర్థిక లావాదేవీల బ్యాంక్‌ల ఇంటర్‌ ఫీజును రూ.15 నుంచి 17కు పెంచింది. ఆర్థికేతర లావాదేవీలపై ఛార్జీలను రూ.5 నుంచి 6కు చేర్చింది. ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం క్రెడిట్‌ కార్డులు లేదా డెబిట్‌ కార్డుల ద్వారా జరిగే చెల్లింపుల ప్రాసెసింగ్‌ కోసం వ్యాపారుల నుంచి ఈ ఇంటర్‌చేంజ్‌ ఫీజులను బ్యాంకులు వసూలు చేస్తాయి. ఖాతాదారులు తమ సొంత బ్యాంక్‌ ఎటిఎంల నుంచి నెలకు ఐదుసార్ల కంటే అదనంగా నెరవేర్చే ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలపై ఛార్జీలను రూ.20 నుంచి రూ.21కి పెంచింది. ఇది జనవరి 2022 నుంచి అమల్లోకి రానుంది. ఇతర బ్యాంక్‌ ఎటిఎంల నుంచి మెట్రో నగరాల్లోనైతే మూడుసార్లు, మెట్రోయేతర నగరాల్లో ఐదుసార్లు ఉచిత లావాదేవీలకు అనుమతి ఉంటుంది.