ప్రజాశక్తి -సీలేరు
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో డ్రైవింగ్ లైసెన్స్ మేళా త్వరలో నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నట్లు చింతపల్లి అడిషనల్ ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ వెల్లడించారు. బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల చింతపల్లి ముత్యాలమ్మ పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూములో ఫిర్యాదుల విభాగానికి యువకులు డ్రైవింగ్ లైసెన్స్ కల్పించాలని సుమారు 1000 వినతలు వచ్చాయని తెలిపారు. ఈ క్రమంలోనే చింతపల్లిలో డ్రైవింగ్ లైసెన్స్ మేళా త్వరలో పోలీస్ శాఖ ద్వారా చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అనుమతుల కోసం దీనిపై కలెక్టర్, ఐటిడిఎ పిఓ, రవాణా శాఖ అధికారులకు లిఖితపూర్వకంగా సమాచారాన్ని చేరవేస్తామన్నారు. ప్రత్యేకంగా నిరుద్యోగ యువకులకు లైసెన్స్ మేళా కార్యక్రమం చేపట్టడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. చింతపల్లిలో లైబ్రరీని దిక్సూచి పేరిట ఆధునికీకరిస్తామన్నారు. గంజాయి నిర్మూలన, బాల్యవివాహాలు, మద్యం, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై గిరిజన యువతను చైతన్యపరిచే విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గిరిజనుల ఆకట్టుకునే విధంగా వీడియోలు రూపొందించి వాటితో వినోదభారతి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. వారపు సంతల్లో గిరిజనులకు ఉపయోగపడే విధంగా మొబైల్ ఆధార్ సేవలను కొనసాగిస్తామని, వీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.










