
ప్రజాశక్తి-అనకాపల్లి
నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని, కోడూరు చుట్టుపక్కల ప్రాంతాల యువతకు ఉపాధి కల్పించేందుకు ఇక్కడే ఆటోనగర్ ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మండలంలోని కొత్తకోడూరు, పాతకోడూరు, మర్రిపాలెం గ్రామాలలో శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి అమర్నాథ్ నిర్వహించారు. గ్రామంలో సుమారు రూ.40 లక్షలు నాడు నేడు నిధులతో అభివృద్ధి చేసిన పాఠశాలను, రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని, కోడూరులో వాటర్ హెడ్ ట్యాంక్‌ను ప్రారంభించారు. స్థానికులు చెప్పిన సమస్యలను విని వాటికి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధిని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా, వైద్య రంగాలతో పాటు ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకువచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, కోడూరు సర్పంచ్ సేనాపతి లక్ష్మి శ్రీనివాస్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.