Sep 11,2023 22:09

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
          జిల్లాలో ఏర్పాటు చేసిన బ్లడ్‌ బ్యాంకును వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షులు పి.ప్రశాంతి కోరారు. భీమవరం మండలం రాయలంలో ఏర్పాటు చేసిన రెడ్‌క్రాస్‌ రక్త కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బ్లడ్‌బ్యాంక్‌ లైసెన్సు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడ్‌క్రాస్‌ సహకారంతో రెడ్‌క్రాస్‌ నేషనల్‌ హెచ్‌క్యూ ద్వారా రూ.1.20 కోట్ల విలువైన అన్ని పరికరాలను సమకూర్చనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే పలువురు సభ్యత్వం, దాతల సహకారంతో మౌలిక వసతులు కల్పించామన్నారు. బ్లడ్‌ బ్యాంక్‌ కోసం సిద్ధం చేసిన సౌకర్యాలు, పరికరాల గురించి రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎంఎస్‌విఎస్‌.భద్రిరాజును కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. బ్లడ్‌ బ్యాంక్‌ను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా జిల్లాప్రజలకు మేలు చేకూరుతుందని కలెక్టరు అన్నారు.