Aug 05,2023 22:06

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

కలెక్టరేట్‌: జిల్లాలో మొబైల్‌ టవర్ల ఏర్పాటులోకలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తీసుకున్న చొరవ పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి ప్రశంసించారు. జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గృహ నిర్మాణం, రీ సర్వే, మొబైల్‌ టవర్ల ఏర్పాటు, ప్రాధాన్యతా పనులు, జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై సమీక్షించారు. మొబైల్‌ టవర్ల ఏర్పాటులో చొరవ తీసుకుని స్థలాలను త్వరగా అప్పగించడం పట్ల ప్రధాన కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేసి ప్రశంసించారు. జగనన్న కాలనీలను జిల్లా కలెక్టర్లు సందర్శించి గృహాలు త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈనెలాఖరుకు రాష్ట్రంలో 5 లక్షల గహాలు ప్రారంభించడం జరుగుతుందని ఆయన చెప్పారు. నా భూమి - నా దేశం (మేరి మాటీ - మేరి దేష్‌), నేల తల్లికి నమస్కారం - నా దేశం కార్యక్రమాన్ని ఈనెల 9న ప్రారంభించాలన్నారు. వసుధ వందన్‌ కార్యక్రమాన్ని పంచాయితీలో నిర్వహించి కనీసం 75 మొక్కలు నాటాలని సూచించారు. పిఎం కిసాన్‌ - ఇ కెవైసి నమోదును ఈ నెల 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఆడుదాం ఆంద్రా కార్యక్రమంను అక్టోబరు 2 నుండి నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, పార్వతీపురం ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్‌, డిఆర్‌ఒ జె.వెంకటరావు, పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.