* శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - ఆమదాలవలస: నియోజకవర్గ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలు, మున్సిపాల్టీ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి కనీస మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సచివాలయం పరిధిలోని కనీస వసతుల కల్పనకు కట్టుబడి ఉందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పలు సచివాలయాల పరిధిలో చేపట్టిన పనులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు చేరాయో, లేదో తెలుసుకునేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించామన్నారు. నియోజకవర్గ పరిధిలోని 87 సచివాలయాల్లో 52 సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. ఆమదాలవలస మండలంలో పది సచివాలయాలు, మున్సిపాలిటీ పరిధిలో 11 సచివాలయాలు, పొందూరు మండలంలో 14, సరుబుజ్జిలి మండలంలో 8, బూర్జ మండలంలో తొమ్మిది సచివాలయాల పరిధిలో ఇప్పటివరకు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు వినతులను ఆయా గ్రామాల పరిధిలో ప్రజలు అందజేశారని, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. కనీస వసతుల కల్పనకు ప్రతి సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షలు కేటాయించినట్లు గుర్తు చేశారు. అవసరం ఉన్న చోట చేపట్టే పనులకు ఈ నిధులను వినియోగించాలని స్పష్టం చేశారు. కొన్ని సచివాలయాల పరిధిలో ప్రతిపాదనల మేరకు పనులు చేపట్టామన్నారు. ఇప్పటివరకు వాటిలో ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని కొనసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనసాగుతున్న పనులపై పూర్తిస్థాయిలో దృష్టిసారించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిగిలిన సచివాలయాలు పరిధిలో అవసరమయ్యే పనులను గుర్తించాలని, వాటికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో విద్యుత్‌శాఖ ఇఇ సత్తారు బయ్యన్నాయుడు, మున్సిపల్ కమిషనర్ రవిసుధాకర్, ఎంపిడిఒలు హరిహరరావు, రవి, మురళీమోహన్, వాసుదేవరావు ఎంపిపి ప్రతినిధులు కె.బి.జి సత్యనారాయణ, నాగేశ్వరరావు, జెడ్‌పిటిసిలు రామారావు, సురవరపు నాగేశ్వరరావు, వైసిపి నాయకులు బొడ్డేపల్లి రమేష్ కుమార్, ఎ.ఉమామహేశ్వరరావు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ఇపిడిసిఎల్ ఎఇలు తదితరులు పాల్గొన్నారు.










