Aug 17,2023 22:36

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, కలెక్టర్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: జిల్లాలో చేపడుతున్న ప్రాధాన్యతా భవనాలు, గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని గృహ నిర్మాణ సంస్థ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మహమ్మద్‌ దివాన్‌ మైదీన్‌, కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి మండల స్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న రీ సర్వే పనులు మరింత వేగవంతం కావాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ క్లినిక్స్‌, బల్క్‌ మిల్క్‌ సెంటర్స్‌, గొడౌన్లను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. జిల్లాలో చేపట్టిన పేదలందరికీ ఇల్లు ప్రగతిలో ఉన్నా లక్ష్యసాధనలో మిగిలిన గృహాలనూ పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి త్వరలో సామూహిక గృహ ప్రవేశాల తేదీని ఖరారు చేసే అవకాశముందని, ఈలోగా ప్రగతిని సాధించాలన్నారు. జగనన్నకు చెబుదాం ద్వారా ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారమవుతున్నందున దీనిపై అధికారులు దృష్టిసారించాలని చెప్పారు. సమావేశంలో జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌, గృహనిర్మాణ సంస్థ పీడీ ఎన్‌.గణపతి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.