ప్రజాశక్తి-పాడేరు: ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు నిర్మాణం వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పూర్తయిన పనులకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్లైన్‌లో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. సకాలంలో అప్ లోడ్ చేయని వారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే చెప్తున్నప్పటికీ స్పందించక పోవడం పై అసహనం వ్యక్తం చేశారు. రానున్న రెండు రోజుల్లో పెండింగ్ బిల్లులు అప్‌లోడ్ చేసి నిర్ధారణ ఇవ్వాలని ఆదేశించారు. అడ్వాన్సులు తీసుకుని పనులు చేపట్టని వారిని గుర్తించి రికవరీ చేయాలని, కొత్త కాంట్రాక్టర్లను గుర్తించి వారికి పనులు అప్పగించాలని సూచించారు. పాడేరు నియోజక వర్గంలో కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ అరుకు నియోజకవర్గ పరిధిలో పురోగతి సాధించాల్సి ఉందని సూచించారు. రంపచోడవరం నియోజకవర్గ ఫరిధిలో ప్రాధాన్యత భవనాలు నిర్మాణం వేగవంతం చేయాలని, ఐటీడీఏ పీవో పర్యవేక్షించాలనీ సూచించారు. డుంబ్రిగుడ, పెదబయలు కాంట్రాక్టర్లు అశోక్, సుబ్బారెడ్డి లు పది రోజులలో పనులు ప్రారంభించకపోతే తదుపరి రెండు సంవత్సరాలు వారిద్దరినీ బ్లాక్ లిస్టులు పెట్టడానికి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సంబంధిత డి.ఇ.ఇ కి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఈ మూడు ఫైళ్ళను వెంటనే సర్క్యులేట్ చేయాలని పిఆర్‌ఐ డి.ఇ.ఇ కొండయ్య పడాల్ ను ఆదేశించారు. ఈ హైబ్రిడ్ సమావేశంలో ప్రధాన కేంద్రం నుండి కలెక్టర్ తో పాటు పంచాయతీ రాజ్ ఇఇ లావణ్య కుమార్, డిఇఇలు, ఎఇలు, మండలాల నుండి పాడేరు, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు వి.అభిషేక్, సూరజ్ గనోరే, ఎంపిడిఓలు, డిఇఇలు, తదితరులు పాల్గొన్నారు.










