Oct 09,2023 21:12

అభివృద్ధి పనులపై ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన అభివృద్ధి పనులను సమయస్ఫూర్తితో పూర్తి చేసి ప్రగతి సాధించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సాలూరు నియోజక వర్గంలోని గడపగడపకు మన ప్రభుత్వం కింద ప్రాధాన్యతా క్రమంలో మంజూరైన పనుల ప్రగతిపై సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సాలూరు మున్సిపాలిటీ, మక్కువ, పాచిపెంట మండలాల గ్రామ సచివాలయం పరిధిలోని మంజూరైన పనులు వివిధ దశల్లో ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు పూర్తయినప్పటికీ బిల్లులు అప్‌లోడ్‌ చేయకపోవడానికి గల కారణాలను సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను ప్రశ్నించారు. బిల్లులు అప్లోడ్‌ చేయని కారణంగా చెల్లింపులో జాప్యం జరుగుతుందన్నారు. జిజిఎంపి పనులు బిల్లుల చెల్లింపులకు నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. జిల్లాలో మరో రూ.11 కోట్ల వరకు అభివృద్ధి పనులకు కేటాయించేందుకు నిధులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం మంజూరైన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఇంజనీరింగ్‌ సహాయకులు, ఇంజనీరింగ్‌ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఎవరినీ ఉపేక్షించేదిలేదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే పది రోజుల్లో పెండింగ్‌లో ఉన్న పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్‌, డ్వామా పిడి కె.రామచంద్రరావు, ఆర్‌ డబ్ల్యూ ఎస్‌ ఇంజనీరింగ్‌ జిల్లా అధికారి ఓ.ప్రభాకర రావు, సాలూరు మున్సిపల్‌ కమిషనర్‌ టి.జయరామ్‌, సాలూరు, మక్కువ మండల ఇంజనీరింగ్‌ అధికారులు రజిత్‌, వరలక్ష్మి, డిఇలు శ్రీరామ్మూర్తి, డి.చిన్నంనాయుడు, ఎఇ ఎల్‌.సూరి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.