- రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదేశించారు. నగరంలోని డేఅండ్‌నైట్ కూడలి నుంచి బలగ వరకు రోడ్డు విస్తరణ పనులు సాగుతున్న నేపథ్యంలో కొత్తగా నిర్మిస్తున్న పలు రక్షణ గోడలకు సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఐటిఐ ప్రాంగణంలో నిర్మించే కాంపౌండ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలోని డే అండ్ నైట్ నుంచి ఆమదాలవలస వరకు నిర్మిస్తున్న 80 అడుగుల రహదారి పనుల్లో ప్రభుత్వ భవనాల రక్షణ గోడలను తొలగించడమవుతోందని, వాటి స్థానంలో కొత్తగా రక్షణ గోడలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఆర్‌టిసి కాంప్లెక్స్, జిల్లా కోర్టు, పోలీస్ గెస్ట్‌హౌస్, తహశీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ ఐటిఐ భవనాల చుట్టూ రక్షణ గోడలు నిర్మిస్తున్నామన్నారు. ఈ నిర్మాణాలకు ప్రభుత్వం రూ.1.10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వాటితోపాటు ప్రైవేట్ యాజమానులకు అందిస్తున్న పరిహారంతో వారు తమ కట్టడాలను మరింత అందంగా తీర్చిదిద్దుకునేందుకు వీలుందన్నారు. కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ, కార్పొరేషన్ల చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, అర్‌అండ్‌బి డిఇ గణపతిరావు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఎం.వి పద్మావతి, సాధు వైకుంఠరావు, జెడ్‌పిటిసి రుప్ప దివ్య, వైసిపి నాయకులు అంబటి శ్రీనివాసరావు, మెంటాడ స్వరూప్, మండవిల్లి రవి, గణపతి పట్నాయక్, రఫీ, ఖాన్, కోణార్క్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.










