Sep 30,2023 21:00

అఖిలపక్షాల ఆధ్వర్యాన ధర్నా
ప్రజాశక్తి - నరసాపురం టౌన్‌
ఎల్‌బి.చర్ల పెదపట్నపు వెంకటస్వామి చల్లాలమ్మ ప్రభుత్వ ఆసుపత్రి మరమ్మతు పనులు పూర్తిచేసి పున:ప్రారంభించాలని, మంజూరైన మెడికల్‌ ల్యాబ్‌ పనులను వెంటనే చేపట్టాలని అఖిల పక్షాల ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు మాట్లాడారు. సంవత్సరం క్రితం ఆసుపత్రి మరమ్మతుల నిమిత్తం పక్కనే ఉన్న లేసు భవనంలోకి మార్చారని, అయితే ఇక్కడ రోగులకు కనీస సౌకర్యాలు లేవని తెలిపారు. గర్భిణులు భవనం హాల్లోనే ప్రసవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ల్యాబ్‌ సౌకర్యాలు లేవని, డాక్టర్లు, రోగులు కూర్చోడానికి కూడా స్థలం లేదని తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఎబిచర్ల ఆసుపత్రిని ఎందుకు గాలికొదిలేసిందని విమర్శించారు. త్వరగా ఆసుపత్రికి మరమ్మతులు చేపట్టి ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. టిడిపి నేత బైనపాలెం శివ శంకర్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జల్లి రామ్మోహనరావు, జనసేన నాయకులు కె.సంజీవరావు, కె.సుభాకర్‌, అచ్చెర్ల నాగ ప్రసాద్‌, టిడిపి నాయకులు గుబ్బల వీరస్వామి, సిపిఎం నాయకులు గుత్తుల శ్రీరామ్మూర్తి, గుబ్బల నాగేశ్వరరావు, గుత్తుల శ్రీరామ చంద్రుడు పాల్గొన్నారు.