ప్రజాశక్తి - హాలహార్వి
పట్టణంలోని ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి నెట్టికంటమ్మ అధ్యక్షతన ఎంపిడిఒ ఆంథోని అధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం తూతూమంత్రంగా సాగింది. అధికారులు ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా జడ్‌పిటిసి లింగప్ప మాట్లాడారు. మండలంలోని ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని మండలంలో అన్ని గ్రామాలకూ తాగునీరు సరఫరా చేయాలని నీటిపారుదల అధికారులను కోరారు. బేవినహల్, కొక్కరచేడు సర్పంచులు మాట్లాడుతూ... తమ గ్రామాలకు నీటి సమస్య ఏక్కువగా ఉందని తెలిపారు. దాదాపు 25 రోజుల నుంచి నీళ్లు రాలేదని, తాత్కాలికంగానైనా నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని కోరారు. అలాగే శాశ్వత పరిష్కారం కింద చింతకుంట చెరువు వెడల్పు పెంచాలని తెలిపారు. లేకపోతే కొత్త చెరువు నిర్మించాలని కోరారు. ఎఒ శివశంకర్ మాట్లాడుతూ... మండలంలో రైతు భరోసా కింద రూ.5500, పిఎం కిసాన్ రూ.2 వేలు రైతుల ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. ఐసిడిఎస్ అధికారి చంద్రావతి మాట్లాడుతూ... మండలంలో కొత్తగా 4 భవన నిర్మాణ కేంద్రాలకు ప్రపోజల్ వచ్చాయని తెలిపారు. డిటి బ్రహ్మయ్య మాట్లాడుతూ... భూ రీసర్వేకు అందరూ సహకరించాలని కోరారు. అధికారులందరినీ వారివారి విభాగాల్లో సమస్యలపై ప్రశ్నించారు. వైస్ ఎంపిపి నాగేష్, ఇఒఆర్‌డి మల్లికార్జున, ఎపిఒ శ్రీనివాసులు, వెటర్నరీ డాక్టర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిడిఒ ఆంథోని










