Dec 31,2022 22:03

పత్తా లేని మంత్రులు, ఎంఎల్‌ఎలు
కలెక్టర్‌ సైతం సమావేశానికి దూరం
జెడ్‌పి చరిత్రలోనే అత్యంత పేలవంగా సర్వసభ్య సమావేశం
తాగునీరు, ధాన్యం, విద్యా సమస్యలపై జెడ్‌పిటిసిల ప్రశ్నలు
ఆఫ్‌ నాలెడ్జ్‌ సిఇఒతో ప్రభుత్వ ప్రతిష్టకు దెబ్బ: నరసాపురం జెడ్‌పిటిసి
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ప్రజా సమస్యలపై చర్చలకు, పరిష్కారాలకు వేదికగా నిలవాల్సిన ఉమ్మడి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం తూతూమంత్రంగా ముగించేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఉమ్మడి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ అధ్యక్షతన శనివారం జరిగిన జెడ్‌పి సర్వసభ్య సమావేశం జరిగిన తీరు చూసిన వారంతా ఇలాంటి దారుణమైన సమావేశం జిల్లా పరిషత్‌ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లా పాలనకు వెన్నుముకగా జిల్లా పరిషత్‌ను పేర్కొంటారు. అటువంటి జెడ్‌పి సమావేశంలో ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని స్థానిక ప్రజాప్రతినిధులంతా వెయ్యికళ్లతో ఎదురుచూస్తారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిల్లాలోని మంత్రులు, ఎంఎల్‌ఎలంతా ఈ సమావేశానికి హాజరై ప్రజాసమస్యలను చర్చించి పరిష్కారానికి కృషి చేస్తారు. అదే సమయంలో కలెక్టర్‌, జిల్లాలోని అన్నిశాఖల అధికారులు ఈ సమావేశానికి తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. అలాంటి సమావేశానికి జిల్లా కలెక్టర్‌గాని, ఇన్‌ఛార్జి మంత్రి, ఇతర మంత్రులతోపాటు, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15 నియోజకవర్గాల్లోని ఏఒక్క ఎంఎల్‌ఎగాని హాజరు కాకపోవడం గమనార్హం. జిల్లా కలెక్టర్‌కు వేరే ముఖ్యమైన పని ఉంటే జెసి హాజరయ్యేవారు. ఈ సమావేశంలో అదీ లేకుండాపోయింది. వేదికపై జెడ్‌పి ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌, సిఇఒ కె.రవికుమార్‌ మాత్రమే ఉన్నారు. ఉదయమే స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించి మధ్యాహ్నం రెండుగంటల తర్వాత సర్వసభ్య సమావేశం సుమారు రెండు గంటలపాటు నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్య, వ్యవసాయ, ఇరిగేషన్‌, డిఆర్‌డిఎ, సాంఘిక సంక్షేమ శాఖలపై మాత్రమే చర్చ నిర్వహించి తూతూమంత్రంగా సమావేశం కానిచ్చేశారు.
చూస్తాం.. చేస్తామంటూ ముక్తసరి సమాధానాలు
జిల్లా పరిషత్‌ సమావేశంలో వివిధ మండలాలలకు చెందిన జెడ్‌పిటిసి, ఎంపిపిలు పలు సమస్యలను లేవనెత్తారు. మొగల్తూరు మండలంలో తాగునీటికి సంబంధించిన ఇబ్బందులపై అక్కడ జెడ్‌పిటిసి ప్రస్తావించారు. జలజీవన్‌ మిషన్‌కు పదిశాతం నిధులు కట్టాలని చెప్పడంపై ప్రశ్నించారు. పోలవరం మండలం రామయ్యపేటలో తాగునీటికి పైప్‌లైన్‌ వేయాలని, వేలేరుపాడు మండలం రామవరపు పంచాయతీ పరిధిలోని ఎనిమిది గ్రామాలకు ఒకే ట్యాంక్‌ ఉందని, మరో రెండు ట్యాంకులు కావాలని, రేపాకగొమ్ములోనూ చేతిపంపులు కావాలని ఆయా సభ్యులు కోరారు. భీమడోలు మండలం ఆగడాలంక, చెట్టున్నపాడు, లక్ష్మిపురంలో పది రోజులుగా తాగునీరు లేదని, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భీమడోలు ఎంపిపి తెలిపారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు నిధులు మంజూరయ్యాయి.. ప్రణాళికదశలో ఉన్నాయని, చేస్తాం.. చూస్తామనే సమాధానాలతోనే అధికారులు సరిపెట్టారు. ఆచంట జెడ్‌పిటిసి మాట్లాడుతూ మండలంలో ఏర్పాటు చేసిన జూనియర్‌ కాలేజీలో ఇప్పటి వరకూ ఒక్క లెక్చరర్‌ను కూడా నియమించలేదని, మార్చిలో ఇంటర్‌ పరీక్షలు విద్యార్థులు ఎలా రాయాలని, ల్యాబ్‌లు లేవని ప్రశ్నించారు. ఇదే సమస్య జిల్లావ్యాప్తంగా ఉందన్నారు. దీనిపై డిఇఒ మాట్లాడుతూ చర్యలు తీసుకుంటాం, సమస్యను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం గిరిజన పాఠశాలలో నూతన భవన నిర్మాణం ప్రారంభించి మధ్యలో ఆపేశారన్నారు. చింతలపూడి మండలంలో జరిగే పనుల గురించి ప్రజాప్రతినిధులకు అధికారులు సమాచారం కూడా ఇవ్వడం లేదని, మధ్యాహ్న భోజనంలో ఉపయోగించే బియ్యం నాసిరకంగా ఉన్నాయని ప్రస్తావించారు. ప్రొటోకాల్‌ సమస్యకు సంబంధించి ప్రతి సమావేశంలోనూ చర్చ జరుగుతుందని, అయినా పరిస్థితిలో మార్పు లేదని, అధికారులు సరిగా పని చేయకపోవడంతో చేసిన పనులకు బిల్లులు కూడా కావడం లేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లకు సంబంధించి ఏలూరు జిల్లాలో 1400 మాత్రమే అనర్హమైనవని తేలాయని అధికారులు తెలిపారు. తొలగించినంత సులువుగా ఆధారాలు చూపినప్పటికీ మళ్లీ ఇవ్వడం లేదని సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. పోలవరం మండలంలో సమస్యలపై ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదంటూ అక్కడ జెడ్‌పిటిసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తేమశాతం తేడా ఎందుకంటూ ఆగ్రహం
ధాన్యం కొనుగోలులో రైతుభరోసా సిబ్బంది తేమశాతం 17 శాతంలోపుగా నిర్థారించిన తర్వాత మిల్లర్లు 20 శాతంగా పేర్కొని సొమ్ము కట్టించుకోవడం ఏమిటని సభ్యులంతా ముక్తకంఠంతో ప్రశ్నించారు. దీనిపై వ్యవసాయాధికారులు, పౌర సరఫరాల శాఖాధికారులు ఇచ్చిన సమాధానాలకు సభ్యులు సంతృప్తి చెందలేదు. లారీలు ఉండటం లేదని, గోనె సంచుల ఇబ్బందులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సభ చివరిలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.47 కోట్లు బడ్జెట్‌కు అమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు.
ఆఫ్‌ నాలెడ్జ్‌ సిఇఒతో ప్రభుత్వానికి చెడ్డపేరు
బొక్కా రాధాకృష్ణ, నరసాపురం జెడ్‌పిటిసి
జెడ్‌పి సిఇఒ రవికుమార్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని, సగం పరిజ్ఞానం ఉన్న వ్యక్తి సిఇఒగా ఉండటం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని నరసాపురం జెడ్‌పిటిసి బొక్కా రాధాకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో జెడ్‌పిటిసికి రూ.కోటి నిధులను జెడ్‌పి ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ కేటాయిస్తే నరసాపురం మండలానికి రూ.40 లక్షలు మాత్రమే ఇచ్చారని, దీనిపై అనేకసార్లు తిరిగినా ఫలితం లేకుండాపోయిందని అన్నారు. మీకు నిధులివ్వాలంటే జిల్లా పరిషత్‌ భవనం అమ్మేయాలని సిఇఒ వెటకారంగా మాట్లాడారన్నారు. జెడ్‌పిటిసిలంటే సిఇఒకు ఏమాత్రం గౌరవం లేదన్నారు. అభివృద్ధి పనులు జరగకుండా సిఇఒ అడ్డుపడుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని మండిపడ్డారు. జెడ్‌పి ఛైర్మన్‌ చెప్పి పంపించినా నిధులపై లెక్కలేనితనంగా సిఇఒ వ్యవహరిస్తున్నారని, అధికారులను సైతం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. జెడ్‌పిటిసి మాట్లాడుతుండగా సిఇఒ మైక్‌ కట్‌చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్‌పి ఛైర్మన్‌ సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. జెడ్‌పి ఛైర్మన్‌ కష్టపడుతున్నా సిఇఒ తీరుతో అప్రతిష్ట ఏర్పడుతుందన్నారు. జెడ్‌పి ఛైర్మన్‌ కేవలం నిమిత్త మాత్రుడని, జెడ్‌పి సిఇఒనే అన్నీ తానై వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో జెడ్‌పి సమావేశంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆరోపణలకు నిలువుటద్దమైంది. జెడ్‌పి సిఇఒ వ్యవహర శైలి ఆది నుంచి వివాదాస్పదంగానే ఉన్నట్లు చర్చసాగుతోంది. జిల్లా పరిషత్‌ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన వివరాలు ముద్రించించిన పుస్తకాలను సభ్యులకు, మీడియాకు అందించేవారు. వాటిని సైతం మీడియాకు అందించకపోవడం సిఇఒ తీరుకు నిదర్శనం. సమావేశానికి కలెక్టర్‌, మంత్రులు, ఎంఎల్‌ఎలు హాజరై ఉంటే జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు ప్రస్తావించిన సమస్యలకు వెంటనే పరిష్కారం దొరికేదనే చర్చ సైతం నడిచింది.