Dec 08,2022 23:59

నిర్వాసితులతో మాట్లాడుతున్న ఆర్‌డిఒ చిన్నికృష్ణ

ప్రజాశక్తి- మునగపాక రూరల్‌
అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో భాగంగా మండలంలోని నాగులపల్లి, మునగపాక, తిమ్మరాజుపేట నిర్వాసితులతో అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణ గురువారం జరిపిన సమావేశం తూతూ మంత్రంగానే సాగింది. మండల కేంద్రం మునగపాకలో పంట భూములకు గజానికి రూ.5,600, వాణిజ్య సముదాయాలకు గజానికి 14,700 ప్యాకేజీ ప్రకటించడం పట్ల నిర్వాసితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా సమావేశం నిర్వహించడం సరికాదని, అందరికీ తెలియజేసి మరో రోజు సమావేశం నిర్వహించాలని ఆర్డీవోను కోరారు. అయితే ఇదే ఆఖరి సమావేశమని ఆయన నిర్వాసితుల అభ్యర్థనను తిరస్కరించారు. నిర్వాసిత నాగులపల్లి, తిమ్మరాజుపేట గ్రామాలకు వేర్వేరు ప్యాకేజీలు ప్రకటించడం సరికాదని నిర్వాసితులు తెలిపారు. నాగులపల్లి గ్రామంలో గజం స్థలానికి రూ.11,700 ప్రకటించగా, తిమ్మరాజుపేటలో పంట భూములకు, వాణిజ్య సముదాయాలు రెండింటికి గజం రూ.7,250 చొప్పున ధరను ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్యాకేజీని పెంచాలని నిర్వాసితులు కోరగా, చట్టంలో ఇంతే ఉందని ఆర్డీవో అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత సమావేశాల్లో గజానికి రూ.2,830, రూ.4,600, ఇప్పుడు రూ.7,200కు పెంచారని, చట్టం నిర్వాసితుల డిమాండ్లను బట్టి ఉంటుందా? అని ఆర్డీవోని ప్రశ్నించారు. గజానికి రూ.14వేలు పరిహారం ఇస్తేనే విస్తరణకు భూములు ఇస్తామని, లేకుంటే ఇవ్వలేమని గ్రామస్తులు ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మళ్ల జయలక్ష్మి, తహశీల్దారు బాబ్జి, జడ్పిటిసి పెంటకోట స్వామి సత్యనారాయణ, వైసిపి మండల కన్వీనర్‌ ఆడారి గణపతి నాయుడు, ఆయా గ్రామాల నిర్వాసితులు పాల్గొన్నారు.