Nov 10,2023 20:56

ప్రజా ప్రతినిధుల స్థానంలో హాజరైన కుటుంబ సభ్యులు

ప్రజాశక్తి - ఆస్పరి
ఆస్పరి మండల సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా సాగింది. శుక్రవారం ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి ఉమాదేవి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎంపిటిసిలు అరకొరగా హాజరయ్యారు. కోరం తగినంత మంది రాకపోవడంతో సభ్యుల కోసం ఎంపిపి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమావేశానికి వచ్చిన అరకొర సభ్యులు కూడా ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో విఫలమయ్యారు. ప్రజా ప్రతినిధులు హాజరు కావాల్సిన స్థానంలో కుటుంబ సభ్యులు హాజరు కావడం గమనార్హం. ఒక్క తంగరడోన ఎంపిటిసి నర్సన్న తప్ప మిగతా ఎవరూ ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు ముందుకు రాలేదు. నర్సన్న మాట్లాడుతూ... ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలని, బ్యాంకులో తీసుకున్న రుణం రూ.2 లక్షల వరకు మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. మండలంలో సిడబ్ల్యుఎస్‌ స్కీం ఏర్పాటు చేసి తాగునీటి సమస్య రాకుండ పందికోన రిజ్వాయర్‌ నుంచి ఆస్పరి మండలానికి పైపు లైన్‌ ద్యారా నీటిని తీసుకొచ్చి గ్రామాలకు చేయాలని పేర్కొన్నారు. జడ్‌పిటిసి దొరబాబు, ఎంపిడిఒ రాణెమ్మ పాల్గొన్నారు.