గూడు చెదిరిన పక్షిలా
కూలిపోయిన గూడేన్ని తలకెత్తుకొని
ఆకుపచ్చని తీరంమ్మీద
ఆమె అలా నడచిపోతోంది
తరాల ఆదివాసీ చరిత్రకు అవశేషంగా
బతికిన పచ్చని కాలాలకు ఆనవాలుగా
పుట్టెడు దుఃఖంతో ఆమె అలా నడచిపోతుంటే
పూల కన్నీరు కారుస్తోంది పుడమితల్లి
సమస్త అడవి తనమంతా
ఔషధమొక్కల పరిమళమై
ఆమె వెనుకే నడచిపోతోంది!
ఓ అణుధార్మిక మూలకమేదో ..
నల్లమబ్బులా నేల పొరల్లోంచి
కమ్ముకొస్తున్న చోట
గాలిలోంచి.. నేలలోంచి..
మానవ రక్తనాళాల్లోంచి..
నిశ్శబ్దంగా మృత్యువు విస్తరిస్తున్న చోట
రసిగారే రాచపుళ్ల నొత్తుకుంటూ..
కందుబారిన గర్భాన్ని పొదవి పట్టుకుంటూ ..
అంతరించిపోతున్న
ఓ సనాతన ఆదివాసీ గీతాన్ని
పాడుకుంటూ ఆమె అలా నడచిపోతోంది!
కాపాడాల్సిన రాజ్యమే
అడవినొక సంతను జేసి
అమ్మకానికి పెడుతున్నవేళ
కోన .. ఇపుడో కన్నీటి జల !
ఇక అక్కడ ..
చెట్టూ ఉండదు .. చేరడు మట్టీ ఉండదు
అధునాతన భవనాల గోడల మీదే
గర్జిస్తుందిక పెద్దపులి
కొండ గుండెల్లోంచి పొంగే చనుబాల ధార
ఇక విషతుల్యమే
ఆకు పచ్చనితనం ఆవిరై
కనుచూపుమేర విస్తరించేదిక వల్లకాడే
అయినా .. ఇక్కడ దీపాలార్పేసి
ఎవడి వెలుగుల కోసమీ మృత్యుప్రస్థానం ?
కొండ .. ఇపుడో వధ్యశిల !
అడవంతటా చీకట్లు పొటమరించే వేళ ..
ఆమెను అడిగాను
'ఇంతకీ .. అడవికీ నీకు ఏమి సంబంధమని'?
ఆవునీ దూడనీ చూపిందామె మౌనంగా..!
ఆమె చంకజోలలోని సూరీడు మీద
తురాయిపూల వాన కురుస్తోంది
అతడు మెల్లగా జారి ..
తూరుపు జమ్మిచెట్టు మీదకెగబాకుతున్నాడు !!
సిరికి స్వామినాయుడు
94940 10330