ప్రజాశక్తి - పిఎం పాలెం : కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలో ఉన్న పిఎంపాలెం నర్సరీ ప్రాంగణంలో పర్యాటకుల సందర్శన కోసం కొత్తగా రూపుదిద్దుకున్న తూర్పు కనుమల జీవ వైవిద్య కేంద్రాన్ని (ఈస్ట్రన్ ఘాట్స్ బయో డైవర్సిటీ సెంటర్) శనివారం రాష్ట్ర ముఖ్య అటవీ సంరక్షణాధికారి మధుసూధనరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడవుల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు పర్యాటకంగా ఆకర్షించే విధంగా అటవీశాఖలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దివీస్ లేబొరేటరీస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలు అందించిన సిఎస్‌ఆర్ నిధుల సంయుక్త సౌజన్యంతో కేంద్రాన్ని తీర్చిదిద్దామన్నారు. తూర్పు కనుమల్లోని అరకు, పాడేరు తదితర ప్రాంతాలతో పాటు ఇతర ప్రదేశాల నుంచి తెచ్చిన పలు రకాల మొక్కలతో అవి పెరిగే వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి ఆర్కిడారియం ఏర్పాటుచేశామని చెప్పారు. వీటితో పాటు ఆరోగ్య, నక్షత్ర వనాలు, గ్రంథాలయం, ఆహ్లాదకరమైన వనం తదితరాలు ఇక్కడ అందుబాటులో ఉంచామన్నారు. దీని సందర్శనకు ధర నిర్ణయించి త్వరలో సందర్శకులకు అనుమతి కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐఒసిఎల్ సంజరుకుమార్ వాసుదేవన్, దివీస్ జనరల్ మేనేజర్ ఎమ్‌ఎస్‌ఎన్.రావు, గవర్నమెంట్ లైజెన్ కన్సల్టెంట్ వరహాలరెడ్డి, సిఎస్‌ఆర్ మేనేజర్ దేవళ్ళ సురేష్ కుమార్, విశాఖ సర్కిల్ అటవీ ప్రధాన సంరక్షణాధికారి ఎస్.శ్రీకాంతనాథరెడ్డి, జిల్లా అటవీశాఖాధికారి అనంతశంకర్, జూ క్యూరేటర్ నందనిసలారియా, సబ్ డిఎఫ్‌ఒ ధర్మరక్షిత, రేంజ్ అధికారులు బి.రామనరేష్, కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.