ప్రజాశక్తి-గుంటూరు : ప్రపంచీకరణ నేపథ్యంలో టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సుల విభాగాధిపతి ప్రొఫెసర్ పి.పూర్ణచంద్రరావు చెప్పారు. స్థానిక సాంబశివపేట ప్రభుత్వ మహిళా కళాశాలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హిస్టరీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో రెండ్రోజుల శిక్షణలో భాగంగా శుక్రవారం కార్యక్రమానికి ప్రొఫెసర్ పూర్ణచందర్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో వేగంగా అభివద్ధి చెందుతున్న రంగాల్లో టూరిజం అండ్ ట్రావెలింగ్ మూడవ స్థానం ఆక్రమించి, ఆయా దేశాల ఆర్థిక అభివద్ధిలో కీలక పాత్ర పోషిస్తుని తెలిపారు. తరచూ విహారయాత్రలు చేయడం ద్వారా విజ్ఞానం, వినోదంతో పాటు మానసిక వికాసం కలుగుతుందని అన్నారు. టూరిజం ద్వారా ప్రజలకు ఆయా ప్రాంతాల చరిత్ర, భాషలు, సంస్కృతులు, నాగరికత, ఆచార వ్యవహారాల గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశాలు మెరుగవుతాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.ఆర్.జోత్స్నకుమారి మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ మహిళా కళాశాల ద్వారా సాధారణ కోర్సులతోపాటు వృత్తి విద్యా కోర్సుల ద్వారా ప్రతి సంవత్సరం వందలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో హిస్టరీ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్ ఆర్.అనురాధ, అధ్యాపకులు ఎం.భాస్కరరావు, హిస్టరీ రఫీ, విద్యార్థినులు పాల్గొన్నారు.










