
ప్రజాశక్తి- అరకులోయ:సమ్మెతో మూతపడనున్న అరకులోయ మయూరి హిల్ రిసార్ట్స్, పున్నమి వ్యాలీ రిసార్ట్స్, అనంతగిరి హరిత హిల్ రిసార్ట్స్, తైడా జంగిల్ బెల్, లంబసింగ్ టూరిజం రిసార్ట్స్ లు, రెస్టారెంట్లు. టూరిజం కార్మికులతో ఆ శాఖ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలం కావడంతో టూరిజం కార్మికులు ఈనెల 11 శనివారం నుంచి అల్లూరి జిల్లాలోని పర్యాటకశాఖ యూనిట్లన్ని మూసివేసి సమ్మె చేయడానికి కార్మికులు నిర్ణయించుకున్నారు.గత నెల ఏడో తేదీ నుంచి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూ వచ్చారు. పర్యాటకశాఖ యాజమాన్యం స్పందించకపోవడంతో ఈనెల 11 నుంచి సమ్మెబాట పట్టనున్నట్లు ఆ శాఖ యాజమాన్యానికి సమ్మె నోటీసులు జారీ చేశారు. ఇటీవల కాలంలో రాష్ట్ర అప్పటి ఎస్టి కమిషన్ చైర్మన్ తో, టూరిజం యాజమాన్యం, కార్మికుల మధ్య విజయవాడలోచర్చలు జరిగాయి. గత నెలలో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌లతో చర్చలు జరిగాయి. పర్యాటకశాఖ యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. శుక్రవారం కూడా అరకులోయ పున్నమి వ్యాలీ రిసార్ట్స్ లో పర్యాటకశాఖ ఆర్ డి శ్రీనివాస్, డిబిఎం హరిత, టూరిజం కార్మిక సంఘం నాయకులు, అనంతగిరి జెడ్పిటిసి సభ్యుడు సిఐటియు గౌరవ అధ్యక్షుడు దీసరి గంగరాజు టోకూరు సర్పంచ్ మొస్య సమక్షంలో సుదీర్ఘంగా రాత్రి 8 గంటల వరకు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది.
కార్మికుల ప్రధాన డిమాండ్ పర్మినెంట్ చేయాలని, 2010లో అప్పటి టూరిజం ప్రత్యేక సెక్రటరీ చందన ఖాన్ తో జరిపిన ఒప్పందం అమలు చేయాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల హెచ్‌ఆర్ పాలసీ అమలు, సర్వీసు క్వాలిఫికేషన్ పద్ధతిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, కార్మికులకు పదోన్నతులు కల్పించాలని, డైలీ వేస్ కార్మికులకు ఆప్కాస్ లో కలపాలని, టూరిజం కార్మికులందరినీ గ్రాడ్యుటి అమలు చేయాలని టూరిజం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన వాటిలో ఏ ఒక్కటి కూడా పరిష్కారం చూప లేదు.ఈ సమస్యలన్నీ టూరిజం కార్పొరేషన్ పరిధిలో లేదని, గవర్నమెంట్ పాలసీ అంశాలని చర్చల్లో పర్యాటక శాఖ ఆర్డి శ్రీనివాస్ తేల్చి చెప్పడంతో కార్మికులకు వేరే ప్రత్యయం మార్గం లేకపోవడంతో సమ్మెబాటే శరణ్యమని ఏపీ టూరిజం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మిక సంఘాల రాష్ట్రఅధ్యక్షుడు డి గంగరాజు, కార్యదర్శి బాబురావు, అల్లూరి జిల్లా అధ్యక్షుడు నరసింహారాజు, కార్యదర్శి అంజలిరావులు స్పష్టం చేశారు.
సమ్మె పై స్పందించిన జిల్లా కలెక్టర్ ఫోన్లో కార్మిక సంఘం నాయకులతో శుక్రవారం రాత్రి సంప్రదించి నచ్చచెప్పే ప్రయత్నం చేసిన కార్మికులు సశే మీరా అంటూ సమ్మెకే మొగ్గు చూపారు. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి అల్లూరి జిల్లాలోని ఆరు పర్యాటక శాఖ యూనిట్లన్నీ మూతబడనున్నాయి.
కార్మికుల సమ్మెకు మద్దతు : జడ్పిటిసి గంగరాజు
ఈ నెల 11 నుంచి కార్మికులు చేపడుతున్న సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు నిస్తున్నామని అనంతగిరి సిపిఎం జెడ్పిటిసి సభ్యుడు దిసరి గంగరాజు స్పష్టం చేశారు. కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని 2010 నుంచి పోరాడుతున్నప్పటికీ టూరిజం యాజమాన్యం ఇప్పటివరకు కూడా కనీసం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.చాలీచాలని వేతనంతో కుటుంబ పోషణకు పిల్లల చదువులకు తీవ్ర ఇబ్బందులు పడుతూ దుర్భర జీవితం గడుపుతున్నారని ఆయన అన్నారు. ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ సమస్యలు పరిష్కరించడానికి అధికారులకు ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.ఈ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులు కూడా టూరిజం కార్మికులకు అండగా నిలబడి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు మద్దతుగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, టూరిజం కార్మికుల సమస్యల పట్ల స్పందించాలని ఆయన అన్నారు. పర్యాటకశాఖ కార్మికుల సమస్యలను జిల్లా పరిషత్ సమావేశంలో కూడాలేవనెత్తి ప్రస్తావిస్తానని జడ్పిటిసి గంగరాజు స్పష్టం చేశారు.