ప్రజాశక్తి -తగరపువలస : భీమిలి మండలం పెద నాగమయ్యపాలెంలో శిథిలావస్థకు చేరిన తుపాను రక్షిత భవనాన్ని పునర్నిర్మించాలని, లేదా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేసిన నిధులు రూ.18 లక్షలు మంజూరు చేసి మరమ్మతు పనులు చేయాలని పలువురు గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంబంధిత తుపాను రక్షిత భవనం వద్ద ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ వార్డు సభ్యులు దూడ పోలయ్య, ఎం కొర్లయ్య, స్థానికులు గరికిన పరశురాం, దూడ ధనంకొండ, బడే ఎల్లారావు మాట్లాడుతూ, తుపాను రక్షిత భవనాన్ని పునర్నిర్మించాలని చెప్పిన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులే మరమ్మతులకు రూ.18 లక్షలు మంజూరుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అధ్యక్షతన జరిగిన పంచాయతీ సమావేశంలో కోరం లేకుండానే తుపాను రక్షిత భవనం కూల్చి వేతకు తీర్మానం చేయడమంటే సమావేశాన్ని అగౌరవ పరచడమేనని పేర్కొన్నారు. అధికారులు దంద్వనీతిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. నూతనంగా తుపాను భవనాన్ని పునర్నిర్మించడం చేతకాని వారు భవనం కూల్చివేతకు ఉత్సాహం చూపడం తగదన్నారు.










