Dec 15,2022 00:11

పాడైన ధాన్యాన్ని చూపుతున్న రైతులు

ప్రజాశక్తి -నక్కపల్లి:తుఫాన్‌ ప్రభావానికి వరి పంట దెబ్బతినడంతో రైతాంగం కన్నీరు పెడుతున్నారు. వరి పంట చేతికందే సమయంలో అకాల వర్షం రైతన్న నడ్డి విరిచింది. శ్రమడోడ్చి కష్టపడి పండించిన పంట కళ్ళముందే నీళ్ల పాలవ్వడంతో రైతులు విలవిల చెందుతున్నారు. మండలంలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి 5115 ఎకరాల్లో సాగు చేశారు. ఏ గ్రామంలో చూసినా వరి ఆశాజనకంగా విస్తారంగా పండింది. చివరి దశలో కోత సమయంలో వరుణుడు రైతాంగంపై పగ తీర్చుకున్నాడు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టి మిట్టాడుతున్నారు. పలు గ్రామాల్లో కోసిన వరి పనలు పొలాల్లోనే ఉండి పోవడంతో వర్షానికి తడిసి ముద్దయ్యాయి. గాలికి వరి చేను నేల కొరిగింది. తుఫాన్‌ ప్రభావం కారణంగా మూడు రోజుల పాటు వర్షం కురవడంతో వరి పనలు తడిచి పోవడంతో పలుచోట్ల ధాన్యం మొలకెత్తాయి. దీంతో, రైతులు ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో ఆవేదనకు గురవుతున్నారు. చాలామంది రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. తుఫాన్‌ దెబ్బకు వరి పంట దెబ్బతినడం, ధాన్యం మొలకెత్తడం, నాణ్యత లోపించడంతో రైతన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పుల ఊబిలో నుండి బయట పడేదెలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అన్నదాతలను ఆదుకోవాలి
ప్రజాశక్తి-నక్కపల్లి:మాండూస్‌ తుఫాన్‌ కారణంగా నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. మండలంలోని ఉపమాక పంచాయతీ శివారు మనబాలవానిపాలెం గ్రామంలో మాండూస్‌ తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న వరి పంటను బుధవారం రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాండూస్‌ తుఫాన్‌ రైతులకు నష్టం మిగిల్చిందన్నారు. వరి చేతికందే సమయంలో అకాల వర్షం రైతులను నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కారణంగా కోసిన వరి దెబ్బతిందని, వరి చేను నేల కొరిగిందన్నారు. దీని కారణంగా రైతులు నష్టపోయారన్నారు. తుఫాన్‌ పోయి 3 రోజులు అవుతున్నా నేటికీ రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు నష్టపోయిన రైతుల పంటలు పరిశీలించక పోవడం, పంటలు నష్టాన్ని నమోదు చేయకపోవడం అత్యంత దారుణమన్నారు. నష్టాన్ని చెల్లించడానికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు అత్యంత అశాస్త్రీయంగా ఉన్నాయని తెలిపారు. పంటలు కోసిన వరి పనలు నీటి మునిగితే దానికి నష్టపరిహారం ఇవ్వడం సాధ్యం కాదని వ్యవసాయ అధికారులు ప్రకటించడం సరైనది కాదన్నారు. దెబ్బతిన్న పంట నష్టాన్ని నమోదు చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తుఫాన్‌ కారణంగా నష్టపోయిన ఏ ఒక్క రైతు కన్నీళ్లు పెట్టుకోకూడదని, ఉదారంగా రైతులు నష్టపోయిన పంటలను నమోదు చేసి నష్టపరిహారం చెల్లించాలని ప్రకటించారని, కింది స్థాయిలో దానికి భిన్నంగా అధికారులు చర్యలు కనబడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.రాజేష్‌, పిక్కి రాజు, రైతులు మనబాల సత్తిబాబు, మనబాల దేముళ్ళ, మనబాల దావీదు రాజు, మనబాల నాని పాల్గొన్నారు.