ప్రజాశక్తి-విఆర్.పురం
మాండూస్ తుపాన్ నేపథ్యంలో మండలంలోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజులు పాటు మండూస్ తుపాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ సమాచారంతో రైతులు దిగులు చెందుతున్నారు. మండలంలో వరి పంట కోత దశకు వచ్చింది. పొగాకు, మిర్చి రైతులు పంటపై దీని ప్రభావం ఉంటుందని రైతులు చెబుతున్నారు. మండలంలో సుమరు 3000 ఏకరాల్లో వరిసాగు చేశారు. వరి పండిపోయినా తుపాన్ కారణంగా చాలా మంది కోత కోయలేదు. తుపాన్ ప్రభావం ఎక్కువ రోజులుంటే పంట పాడైపోతుందని రైతులు చెబుతున్నారు. ఆరుగాలం కష్టించి, అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి వరి సాగు చేశామని, ఇప్పుడు తుఫాన్ ఏమి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
చిరు జల్లులు
సీలేరు : మాండూస్ తుఫాన్ కారణంగా జీకే వీధి మండలం సీలేరు, దారకొండ ప్రాంతాల్లో శనివారం చిరు జల్లులు కురిశాయి. దీంతో వాతావరణం చల్లబడింది. చల్లటి గాళ్లు వీస్తున్నాయి. చలి తీవ్రత అధికమైంది. ఉదయం నుంచి ఆకాశం మేఘవృతమే మబ్బులతో కూడిన వాతావరణం నెలకొంది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో వరి పంటలు పండి కోత దశకు రావడంతో తుఫాన్ కారణంగా చేతికొచ్చిన పంట భుగ్గి పాల అవుతుందని గిరి రైతులు తలలు పట్టుకుంటున్నారు. దారకొండ, కమ్మరతోటలలో వరి కోతలు అడపాదడపా జరుగుతున్నప్పటికీ భారీ వర్షాలు కురిస్తే జలమయమై పంటలు నాశనం అయ్యే అవకాశం ఉందని గిరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.










