Dec 28,2022 23:56

మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలరాజు

ప్రజాశక్తి- అనకాపల్లి
ఇటీవల మాండూస్‌ తుపాన్‌లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, జిల్లాలో మూసివేసిన సుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించాలని పలువురు రైతు నాయకులు డిమాండ్‌ చేశారు. ఈనెల 30న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటన నేపథ్యంలో దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. స్థానిక దొడ్డి రామనాయుడు కార్మిక కర్షక నిలయంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు అధ్యక్షతన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రైతు నాయకులు మాట్లాడారు. సుగర్‌ ఫ్యాక్టరీలు మూసివేసిన నేపథ్యంలో వరి సాగు పెరిగిందని, అయితే పంట చేతికొస్తుందన్న సమయంలో తుఫాను వల్ల 15 వేల ఎకరాల పైగా పంట నష్టం జరిగిందని తెలిపారు. 30 శాతం పంట నష్టం జరిగితేనే పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమన్నారు. సుగర్‌ ఫ్యాక్టరీలు లేని అనకాపల్లి జిల్లాను ఊహించుకోలేమని, వెంటనే మూతపడ్డ వాటిని తెరిపించి క్రషింగ్‌ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ఎడమ కాలువ, సుజల స్రవంతి ప్రాజెక్టులు పూర్తిచేసే విధంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ఎం.అప్పలరాజు, ఎ.బాలకృష్ణ, పిఎస్‌.అజరు కుమార్‌, వైఎన్‌ భద్రం, కె.శంకర్రావు, కృష్ణ అప్పారావు, తేలయ్య బాబు, ఎస్‌.బ్రహ్మాజీ, డి.శ్రీనివాస్‌ మాట్లాడారు.