Dec 07,2022 23:40

దేవరాపల్లి పొలంలోనే కుప్పలు పెడుతున్న రైతులు

ప్రజాశక్తి- దేవరాపల్లి
రాష్ట్రంలో తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో వరి రైతుల్లో ఆందోళన నెలకొంది. ముమ్మరంగా వరి కోతలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో తుపాన్‌ వార్త వారిలో ఒకింత భయాన్ని తెచ్చిపెట్టింది. వర్షం పడితే పొలంలో కోత కోసిన వరి చేను తడిసిపోతుందని ఆందోళన చెందుతున్నారు. బుధవారం సాయంత్రం తుపాన్‌ తీవ్రత పెరుగుతుందన్న భయాందోళనలతో ఇప్పటికే వరి కోతల కోసిన వారు వరిచేనును మడుల్లోనే కుప్పలు పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. మరికొంత మంది కల్లాలకు తెచ్చి కుప్పలు పెడుతున్నారు. వరి కోతలు కోసి పంట అంతా నేలపై ఉందని, వర్షం పడితే తీవ్ర నష్టం తప్పదని రైతన్నలు వాపోతున్నారు.
వరి కోతలు వాయిదా వేయండి
కె.కోటపాడు : ఈనెల 9, 10 తేదీలలో వర్ష సూచన ఉన్నందున వరి కోతలు వాయిదా వేయాలని మండల వ్యవసాయ అధికారి సోమశేఖర్‌ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు వరి కోతలు ముమ్మరంగా కోస్తున్నారని, వర్ష సూచన ఉన్నందున వాయిదా వేయాలని సూచించారు. మళ్లీ ఎండలు వచ్చినప్పుడే వరి కోతలు మొదలు పెట్టాలన్నారు.