
సమాజంలో నెలకొన్న జీవన రీతులు, ఆచార వ్యవహారాలు, వేష భాషలు... ఇవన్నీ సంస్కృతిలో భాగం. అయితే, రాజకీయ వ్యవస్థ భావ ప్రతిబింబం, ప్రవర్తనాసరళి, ఆర్థిక విధానం, పాలనా వ్యవస్థల్లోని వైరుధ్యాలు సంస్కృతిలోనూ ప్రతిబింబిస్తాయి. ఆధునిక జీవితంలో మానవత్వపు చిరునామా చెరిగిపోతోంది. తన సహజసిద్ధమైన మనిషితనాన్ని, మంచితనాన్ని, మానవతను కోల్పోతున్నాడు. కళ్లెదుట తోటి మనిషి ప్రాణం పోతున్నా... అదే మనిషి ప్రాణం తీయడానికైనా... కనీస మానవత్వం చూపని పాషాణం మనుషుల్లో గూడు కట్టుకుంటున్నది. 'మహితోపకార ధర్మము వహించుడుగాని అసహాయ శూరుడు అన్యాపకృతికి (అపకారానికి) అనుచు భూజనులు ఇట్లు తన్ను ఆడుకొనగనుండు మనుజుండు జీవన్మృతుండు గాడె!' అంటాడు శతకకర్త వేంకటకవి. మానవ హక్కుల గురించి, సంస్కృతీ సంప్రదాయాల గురించి సూక్తులు చెప్పే అమెరికాలో తుపాకీ సంస్కృతి అంటువ్యాధిలా వ్యాపిస్తోంది. శ్వేతసౌధానికి రక్తపు మరకలు అద్దుతోంది. బయటకు వెళ్ళినవారు సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం లేని తల్లిదండ్రులున్న దేశం అది. ఎవరు ఎందుకు కాల్పులు జరుపుతారో, ఎవరి చేతిలో ఎవరు చస్తారో తెలియదు. ఎదుటివారు నల్లగా వున్నారనో, తెల్లగా లేరనో అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన ఆవేశంతో అభిజాత్యాన్ని ప్రదర్శించే శ్వేతజాతి దురహంకారం అక్కడ వేళ్లూనుకుంది. ఎవరి మీద ఎవరికి అసహనం కలిగినా తుపాకీ వాడే ఆటవిక సంస్కృతి బుసలుకొడుతోంది.
ద్రవ్య పెట్టుబడి తన దోపిడీ కోసం మతం పేరుతో రంగు పేరుతో, కులం పేరుతో, జాతి పేరుతో ప్రజలను చీల్చేస్తోంది. ప్రజలు ఐక్యం కాకుండా తన దోపిడీ నిరాటంకంగా సాగడానికి చేసే ప్రయత్నమిది. రంగు పేరుతో అమెరికాలో పెచ్చుమీరుతున్న జాత్యహంకారం ఇందుకు అతి పెద్ద ఉదాహరణ. శ్వేత జాతీయుడైన పోలీస్ అధికారి కర్కశత్వానికి జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ మృతిపై స్పందించిన ప్రముఖ రెజ్లర్, హాలీవుడ్ నటుడు డ్వాయిన్ జాన్సన్ 'జాతి వివక్ష అనేది ఒక రోగం' అంటాడు. అమెరికా వంటి సంపన్న దేశాలలో దశాబ్దాల తరబడి వేళ్ళూనిన 'తుపాకీ లాబీ' ప్రభుత్వాలను శాసిస్తోంది. 1791లో అమెరికా రాజ్యాంగం ఆ దేశ పౌరులకు కల్పించిన ఆయుధ హక్కు శ్రుతి మించి ఆధిపత్యం చెలాయిస్తోంది. తుపాకులే తమ ప్రాణాలకు రక్ష...అన్న భావనతో నేటి పాశ్చాత్య పౌర సమాజం జీవిస్తోంది. జాత్యహంకార విష సంస్కృతి విచక్షణా రహితంగా నిస్సహాయులను కాల్చి చంపుతోంది. శాంతియుతంగా జీవిస్తున్న పౌర సమాజాలలోకి క్రమంగా చొచ్చుకొని పోతోంది. తాజాగా టెక్సాస్ లోని ఓ ప్రాథమిక పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు చనిపోగా, మరో 17 మంది గాయపడ్డారు. చనిపోయిన విద్యార్థులంతా 4 నుంచి 11 ఏళ్ల ముక్కుపచ్చలారని చిన్నారులే! అక్కడ తుపాకి సంస్కృతిని అంతం చేయటం గురించి చర్చోపచర్చలు జరుగుతూనే వుంటాయి. 'మాటలు కోటలు దాటతాయి తప్ప... చేతలు గడప దాటవు' అన్నట్టుగా... పార్టీలు, నాయకులు తుపాకీ సంస్కృతిపై విచారం, ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వుంటారు. తూటాలు పేలుతూనే వుంటాయి. మితవాద రిపబ్లికన్లు తుపాకీ సంస్కృతి నిషేధంపై చర్చ వచ్చినప్పుడల్లా వ్యతిరేకిస్తూనే వుంటారు. దీనికి కారణం... అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలను తెర వెనుక ఉండి ఆడించేది కార్పొరేట్ ఆయుధ లాబీ కావటమే.
అమెరికా పౌరుల ఆత్మరక్షణ కోసమంటూ తీసుకొచ్చిన చట్టాలు ఇప్పుడు ఆ ప్రజల ప్రాణాలకే ముప్పుగా పరిణమించాయి. 32.8 కోట్ల జనాభా వున్న ఆ దేశంలో 39.3 కోట్లు తుపాకీలు వినియోగంలో వున్నాయి. సగటున ప్రతి 100 మంది దగ్గర 120 తుపాకులున్నాయని లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు... తుపాకీ కాల్పుల వల్ల ఏటా 30 వేల మంది మరణిస్తున్నారట. ఈ ఏడాది ఇప్పటికే సామూహిక కాల్పుల ఉదంతాలు 212 నమోదు కాగా, మరణించిన వారి సంఖ్య 17 వేలు దాటింది. మతతత్వం - జాత్యహంకారం మితవాదం అనే ఒకే కుదురులోంచి పుట్టుకొచ్చిన కవలల్లాంటివే. భారత్‌లో పెచ్చుమీరుతున్న మతోన్మాదం కూడా అమెరికన్ జాత్యహంకారాన్ని పుణికిపుచ్చుకున్నది. దేశంలో జరుగుతున్న మతోన్మాద దాడులు దాన్ని ధ్రువీకరిస్తున్నాయి. 'ప్రతి మనిషి జీవితం ఒక పాఠమే! అయితే మంచిపాఠం, కాకుంటే గుణపాఠం' అన్నాడొక తత్వవేత్త. అమెరికాలో నెలకొంటున్న జాత్యహంకార దురాగతాలను గుణపాఠంగా తీసుకుని, భారత్‌లో విస్తరిస్తోన్న మతోన్మాదాన్ని, విచ్ఛిన్నవాదాన్ని ఎదుర్కోవాలి. అప్పుడే ప్రపంచశాంతి వర్థిల్లుతుంది.