ప్రజాశక్తి- అనకాపల్లి
తుమ్మపాల వివి రమణ సహకార చక్కర కర్మాగారం అప్పులు ఆస్తుల వివరాలు తెలుసుకునేందుకు నియమించిన లిక్విడేటరును తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఫ్యాక్టరీ గేటు వద్ద మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యాన ఆ పార్టీ కార్యకర్తలు మంగళవారం ఆందోళన చేపట్టారు. సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా, సభ్య రైతుల అనుమతి లేకుండా లిక్విడేటర్‌ను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఫ్యాక్టరీకి రూ.30 కోట్ల అప్పులు చూపించి 300 కోట్ల విలువైన ఆస్తులను దోచుకునేందుకు మంత్రి అమర్‌నాథ్ కుట్ర పన్నారని ఆరోపించారు. సుగర్ ఫ్యాక్టరీపై ఆధారపడి 13 వేల కుటుంబాలు ఉన్నాయని, వారే అమర్‌నాథ్‌ను తరిమి కొడతారని పేర్కొన్నారు. దీనిపై జాయింట్ కలెక్టర్ వచ్చి లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకు ధర్నా ఆపేది లేదని రోడ్డుపై బైఠాయించారు. ఫ్యాక్టరీ జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళనకారులను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే టిడిపి శ్రేణులు జెసి రావాలని పట్టుబట్టడంతో ఇరు వర్గాలకు కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణతో పాటు 25 మంది మంది నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోట్ని బాలాజీ, మల్ల సురేంద్ర, కొణతాల శ్రీనివాసరావు, కర్రీ బాబి, నడిపల్లి గణేష్, తలారి కాశి నాయుడు, చదరం కాశి, సబ్బవరపు గణేష్, పోలవరపు త్రినాథ్, ఆకుల శ్రీను, చెక్కల శ్రీనివాసరావు, శెట్టి వెంకట రమణ, సందిన సునీల్, కొణతాల రత్నకుమారి, వేగి వెంకటరావు, పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.










