ప్రజాశక్తి-అనకాపల్లి
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీని పరిరక్షించాలని, లేకుంటే తక్షణమే రాజీనామా చేయాలని అఖిలపక్ష ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక కోడిగంటి గోవిందరావు భవనంలో ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ కనిశెట్టి సురేష్ బాబు అధ్యక్షతన శనివారం అఖిలపక్ష సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పలు సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సుగర్ ఫ్యాక్టరీని విక్రయించే ప్రయత్నాలను ఉద్యమాల ద్వారా ప్రతిఘటించి పరిరక్షించుకున్న సంగతిని గుర్తు చేశారు. నాటి ఉద్యమానికి తలొగ్గిన ప్రభుత్వం రూ.33 కోట్లు విడుదల చేసి 2018- 19 క్రషింగ్ సీజన్లో గానుగాట ఆడిందని చెప్పారు. నాటి ఉద్యమంలో పాల్గొన్న అమర్నాథ్ ఫ్యాక్టరీని ఆధునికీకరించాలని చెప్పి నేడు అందుకు విరుద్ధంగా ఫ్యాక్టరీని అమ్మడానికి పూనుకోవడం దుర్మార్గమన్నారు. 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్.జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి బహిరంగ సభలో తాము అధికారంలోకి వస్తే తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీని ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చిన సంగతి మరిచారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే లిక్విడేషన్ ప్రక్రియను వెనక్కు తీసుకోవాలని, వచ్చే ఏడాది గానుగాటకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఐ నాయకులు వైన్ భద్రం, సిపిఎం నాయకులు ఎ.బాలకృష్ణ, పలు సంఘాల నాయకులు విల్లూరి పైడారావు, కర్రి అప్పారావు, గంట శ్రీరామ్, శ్రీరామదాసు గోవింద, రాజాన దొరబాబు, కోన లక్ష్మణ, కోరిబిల్లి శంకర్రావు, దూలం గోపి, మల్ల శ్రీను, బొడ్డేడ అప్పారావు, బొట్ట చిన్ని యాదవ్, ఆళ్ల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










