Oct 30,2022 00:04

మాట్లాడుతున్న టిడిపి నేత నాగజగదీష్‌

ప్రజాశక్తి-అనకాపల్లి
తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీ ఆస్తులను మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కబ్జా చేసేందుకు చేస్తున్నారని, దీనిపై ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి రైతులతో కలిసి ఉద్యమిస్తామని టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు నాగ జగదీశ్వరరావు అన్నారు. స్థానిక పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎంపీ వివి.రమణ 151 గ్రామాల్లో రైతుల షేరు దనంతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 1964 సహకార చట్టానికి లోబడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కేవలం ఫ్యాక్టరీ అధికారుల తప్పిదాల వల్లే నష్టాలు పాలైందన్నారు. దీనికి రైతులను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఫ్యాక్టరీకి 34 ఎకరాల భూమి ఉందని, దీని విలువ సుమారు రూ.500 కోట్లు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఫ్యాక్టరీని లిక్విడేట్‌ చేయమని పరిశ్రమల శాఖ ప్రభుత్వాన్ని కోరుతోందన్నారు. ఇది కేవలం మంత్రి చేతకానితనమన్నారు. ఎన్నికల ముందు ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, మంత్రి అమర్నాథ్‌ హామీ ఇచ్చారని, నేడు మడమతిప్పి ఆధునికీకరణకు తిలోదకాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ నియోజకవర్గం కార్యదర్శి లాలం కాశీనాయుడు, చింతకాయల రాజేష్‌ పాల్గొన్నారు.