తుమ్మలగుంట బ్రహ్మోత్సవాలకు భద్రత కట్టుదిట్టం
- వాహన సేవ సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు
- చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్
ప్రజాశక్తి - క్యాంపస్ : తిరుమల తరహాలో తుమ్మలగుంట క్షేత్రంలో జరుగుతున్న కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భద్రతను కట్టుదిట్టం చేయాలని చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ సూచించారు. మంగళవారం రాత్రి ఆలయం వద్దకు వచ్చి భద్రతాపరమైన సూచనలు అందించారు. ఆలయం నుంచి స్వామి వారి వాహన సేవ ప్రారంభమవగానే ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలను తప్పని సరిగా చేయాలన్నారు గ్రామస్తులతో దురుసుగా కాకుండా శాంతి యుతంగా మాట్లాడుతూ ప్రధాన ద్వారం వద్ద ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలన్నారు. భక్తుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉన్నందున భద్రతా పరంగా ఎక్కడా లోపం లేకుండా చూడాలన్నారు. ఇప్పటికే బ్రహ్మౌత్సవాలు నిర్వహణపై అవగాహన కలిగిన సీఐ సురేంద్ర నాథరెడ్డికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. గ్రామ శివార్లలో పోలీసు సిబ్బంది ఎక్కడా హడావుడి చేయకుండా హుందాగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అంతకు ముందు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో చర్చించి ఎక్కడెక్కడ భద్రతా చర్యలు తీసుకోవాలనే అంశంపై తెలుసుకున్నారు.










