
గరుగుబిల్లి : కొమరాడ, జియ్యమ్మవలస మండలాల నుంచి తరలివచ్చిన ఏనుగులు గడిచిన కొద్ది రోజుల నుంచి గొట్టివలస, దళాయివలస పరిసర ప్రాంతాల్లో సంచరించిన ప్రస్తుతం తులసిరామినాయుడువలస సమీపాన గల మామిడి తోటను ధ్వంసం చేస్తున్నాయి. అలాగే శనివారం మధ్యాహ్నం పార్వతీపురం - గరుగుబిల్లి ఆర్ అండ్ బి రహదారి పక్కన ఏనుగులు సంచరిస్తూ ఉండడంతో వాహన చోదకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తులసిరామినాయుడువలస సమీపంలో గడిచిన కొద్ది రోజుల నుంచి ఏనుగులు సంచరిస్తుండంతో గ్రామస్తులు బిక్కుబిక్కు మంటున్నారు. రాత్రి సమయంలో ప్రధాన రహదారిపై ఉంటున్న ఏనుగులు తెల్లవారిన అనంతరం సమీపలోని కొండ వద్దకు, అలాగే తోటల్లోకి వెళుతున్నాయి. ఏనుగులు ప్రస్తుతం సంచరిస్తుండంతో తులసిరామినాయుడువలస, దలాయివలస, గొల్లవానివలస, తదితర గ్రామాలకు చెందిన రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు అధికారులు తగు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఒంటిరి ఏనుగుతో అప్రమత్తం
పార్వతీపురంరూరల్ : గత వారం రోజులుగా ఒడిశాలో ఉన్న ఒంటరి ఏనుగు హరి మరో రెండు రోజుల్లో తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కావున ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గల గ్రామాలు చాలా జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ఏడు ఏనుగుల గుంపు ప్రస్తుతం తులసీరాంనాయుడువలస వద్ద ఉందని, చుట్టుపక్కల గ్రామాలైన ద్లైవియాస, ఉద్దవోలు, బురద వెంకటాపురం, గొల్లవాని వలస, గొట్టివలస, సీమలవాణివలస, ఉల్లిభద్ర, మరిపెంట, సంభానవలస, ఈరనగుడి గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. దీపావళి సందర్భంగా ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో అధిక శబ్దాలు చేసే బాంబులను ఉపయోగించొద్దని అటవీ శాఖ గ్రామస్తులను కోరింది. రాత్రి 8 గంటల్లోపు బాణాసంచా కాల్చడం పూర్తి చేయాలని, ఈ బాంబులను ఉపయోగించి ఏనుగులను ఎవరూ ఆటపట్టించకూడదని, హాని చేయకూడదని సూచించారు. అలాగే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏనుగు ఆచూకీ, ఇతర సమాచారం కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కృష్ణారావు 8790418918, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కృష్ణారావు 9493399467 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.