ప్రజాశక్తి-అద్దంకి: అమరావతి కోసం భూములిచ్చిన రైతన్నల నిరాహార దీక్షలకు కళాకారులు సంఘీభావం తెలిపారు. తుళ్లూరులో కార్యక్రమ నిర్వహణకు నందమూరి కళాపరిషత్, అద్దంకి వారు అక్కడ తగు ఏర్పాట్లు చేశారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చి ప్రస్తుత వైసిపి పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్న రైతన్నలు దాదాపుగా 1200 రోజులకుపైగా నిరాహార దీక్షలు చేస్తున్న తుళ్లూరు రైతుల దీక్ష శిబిరం వద్ద మంగళవారం నందమూరి కల పరిషత్ ఆధ్వర్యంలో కళాకారుల పాటల ప్రదర్శనతో వారికి సంఘీభావం తెలియజేశారు. నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ అందరికీ అన్నం పెట్టే రైతన్న ఈ విధంగా 1200 రోజులకు పైగా అమరావతి అభివృద్ధికి తామిచ్చిన భూములకు న్యాయం చేయమని నిరాహారదీక్ష చేయడం ప్రజాస్వామ్యంలో ఇంతకంటే పాలకులు సిగ్గుపడాల్సిన విషయం మరొకటి ఉండదని అన్నారు. ఇన్ని రోజులు నిరాహార దీక్షలు రైతులు చేయటం ఎక్కడా జరిగి ఉండదని అన్నారు. త్వరలో రైతులే కాదు ప్రజలందరూ కూడా సరైన సమాధానం చెబుతారని త్రిమూర్తులు అన్నారు. దీక్ష శిబిరం సమన్వయ కమిటీ సభ్యుడు కాటా అప్పారావు మాట్లాడుతూ 1,211 రోజులుగా దీక్షలు చేస్తున్నామని, తమకు న్యాయం జరిగే వరకూ దీక్ష శిబిరాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అద్దంకి నియోజకవర్గం నుంచి ఇక్కడికి విచ్చేసి కళాకారులు పాటల ప్రదర్శనతో సంఘీభావం తెలిపినందుకు కళాకారులకు, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. కళాకారులు గోవాడ శ్రీకాంత్, చేబ్రోలు వెంకటసుబ్బయ్యను దీక్షపరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రావులపల్లి వెంకటరావు, పరిటాల పవన్ కుమార్, నిరాహార దీక్ష సమన్వయ కమిటీ సభ్యులతోపాటు దీక్షలో 200 మందికి పైగా రైతులు పాల్గొన్నారు.










