Aug 30,2023 21:07

ప్రజలతో మాట్లాడుతున్న కలెక్టర్‌, కమిషనర్‌

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు,పల్నాడు జిల్లాల్లో ఓటర్లజాబితాల పరిశీలన, సవరణ ప్రక్రియ తుది దశకు చేరింది. అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఇచ్చింది. బిఎల్‌ఓ (బూత్‌ లెవల్‌ అధికారి) స్థాయిలో జాబితాల్లోమార్పులు, చేర్పులపై చేపట్టిన సర్వేపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రంపరిధిలో కొన్ని ప్రాంతాలను నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి తప్పనిసరిగా పరిశీలన చేయాలని ఎన్నికల కమిషన్‌ సూచించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి ఇప్పటికే తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. తొలగించిన ఓటర్లు, ద్వంద్వ ఓటర్లు, డెత్‌ కేసులు, క్రొత్త ఓటర్ల నమోదు వివరాలను జిల్లా కలెక్టర్‌ ఇంటింటికి వెళ్లి ఆకస్మికంగా పరిశీలన చేశారు.
తొలి విడత గత నెల 21 నుంచి ఈనెల 21 వరకు బిఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి పరిశీలన చేశారు. చనిపోయిన, స్థానికంగా ఉండని, వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్నపేర్లను నమోదు చేశారు. చనిపోయిన వారి పేర్లు తొలగించే ప్రక్రియలో తప్పని సరిగా కుటుంబ సభ్యుల నుంచి రాతపూర్వకంగా వివరాలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ సూచించింది. అలాగే ఒక చోట నుంచి మరో చోటకు మారిన వారిని, స్థానికంగా నివాసం ఉండని వారిని గుర్తించారు. ఒక వ్యక్తి రెండు మూడుచోట్ల పేర్లుంటే వాటిని కూడా గుర్తించారు. ఎవరు స్థానికంగా ఉన్నారు? ఎవరు ఉండటం లేదు. ఆధార్‌ చిరునామా స్థానికంగా ఉందా లేదాపరిశీలన చేపట్టారు. రాజధాని ప్రాంతంలో టిడిపి సానుభూతి పరులు ఎక్కువగా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్నా 29 గ్రామాల్లో ఓటర్లుగా ఉన్నారని వైసిపి నాయకులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది.
ఆగస్టు 22నుంచి సెప్టెంబరు 29 వరకు పోలింగ్‌ కేంద్రం స్థాయిలో జాబితాల పరిశీలన, ఓటర్ల ఫోటోల ముద్రణ జరుగుతోంది. ఈ పరిశీలనలో రాజకీయ వత్తిడిలకు తలొగ్గి తప్పులు చేస్తే మీరే బాధ్యులని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి హెచ్చరించారు. తాడికొండ నియోజకవర్గంలో టిడిపి ఓట్లను తొలగించారని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టరు పలుమార్లు ఈ నియోజకవర్గంలో పర్యటించి పరిశీలన చేశారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి విచారించారు. పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ కూడా జిల్లాలోని పలు గ్రామాలకు వెళ్లి బిఎల్‌ఓల పనితీరుపై పరిశీలన చేశారు. ఎక్కడా విమర్శలకు తావులేకుండా పనిచేయాలని అధికారులకు హెచ్చరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఓటర్ల జాబితాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిశితపరిశీలన చేస్తున్నాయి.
ఓటర్ల జాబితాల్లో పేర్లు తొలగింపుపై టిడిపి,వైసిపి నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టిడిపి హయంలో ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల పేర్లు చేర్పించడం వల్ల వాటిని తొలగిస్తున్నామని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. అయితే టిడిపి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. టిడిపి,వైసిపి ఇప్పటికే పరస్పరం ఎన్నికల కమిషన్‌కు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు పంపారు.